Updated : 21 May 2021 12:03 IST

Covid Test: ఒక్క సెకనులోనే కొవిడ్‌ పరీక్ష!  

వినూత్న బయోసెన్సర్‌ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

 దిల్లీ: లాలాజలాన్ని పరీక్షించడం ద్వారా కరోనా ఉనికిని ఒక్క సెకనులోనే గుర్తించే వినూత్న సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలన్నింటిలో ఇదే అత్యంత వేగవంతమైనదిగా పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ సాధనాన్ని రూపొందించారు. కొవిడ్‌ నిర్ధారణకు ప్రామాణిక విధానంగా రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌)ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ద్వారా ఫలితాన్ని తెలుసుకోవడానికి కొన్ని గంటలు లేదా రోజులు పడుతోంది. ఈ సమస్యను కొత్త విధానం పరిష్కరిస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న మింగాన్‌ షియాన్‌ తెలిపారు. సాధారణంగా కొవిడ్‌ అనుమానితుడి నుంచి సేకరించిన నమూనాలో కరోనా వైరస్‌ను గుర్తించాలంటే.. దాని ఆనవాళ్లను పట్టించే జన్యు పదార్థం వంటి బయోమార్కర్ల పరిమాణాన్ని పెంచాల్సి ఉంటుంది. దీన్ని పీసీఆర్‌ విధానంతో చేయాలి. లేదా లక్ష్యంగా ఎంచుకున్న బయోమార్కర్‌ను పరీక్ష సాధనం అంటుకున్నప్పుడు వెలువడే సంకేతాన్ని మరింత పెద్దగా చేయాలి. తాజా పరీక్షలో శాస్త్రవేత్తలు రెండో విధానాన్ని ఎంచుకున్నారు. దానికి మరింత ఆధునికతను జోడించారు. ఈ సాధనంలో సెన్సర్‌ పట్టీ, సర్క్యూట్‌ బోర్డు ఉంటాయి. సెన్సర్‌ పట్టీ అంచుల్లో చిన్నపాటి సూక్ష్మద్రవ మార్గాలు ఉంటాయి. అందులో లాలాజల నమూనాను ఉంచాలి. ఈ నమూనాను స్పృశించేలా కొన్ని ఎలక్ట్రోడ్లను అమర్చారు. వాటిలో ఒక ఎలక్ట్రోడ్‌కు బంగారు పూత పూశారు. లాలాజలంలో కొవిడ్‌ సంబంధ యాంటీబాడీలు ఉంటే అవి బంగారు ఉపరితలానికి అతుక్కుంటాయి. నమూనాను విశ్లేషించే సమయంలో శాస్త్రవేత్తలు.. ఈ సెన్సర్‌ పట్టీలను కనెక్టర్‌ ద్వారా సర్క్యూట్‌ బోర్డుకు అనుసంధానించారు. ఫలితంగా యాంటీబాడీలతో కూడిన బంగారు ఎలక్ట్రోడ్‌కు మరో ఎలక్ట్రోడ్‌కు మధ్య స్వల్పస్థాయి కరెంటు ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఆ కరెంటు సంకేతం.. సర్క్యూట్‌ బోర్డును చేరుతుంది. అందులోని ట్రాన్సిస్టర్‌.. సంకేత పరిమాణాన్ని పెంచుతుంది. అంతిమంగా ఒక సంఖ్య రూపంలో స్క్రీన్‌పై అది ప్రతిబింబిస్తుంది. నమూనాలోని వైరల్‌ ప్రొటీన్‌ తీవ్రతను బట్టి ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది. దీని ఆధారంగా కొవిడ్‌ను నిర్ధారించవచ్చు. ఈ సాధనంలో సెన్సర్‌ పట్టీలను ఒకసారే వాడాల్సి ఉంటుంది. పరీక్ష సర్క్యూట్‌ బోర్డును పునర్‌వినియోగించొచ్చు. కొవిడ్‌ పరీక్ష ఖర్చును ఇది బాగా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర వ్యాధుల నిర్ధారణకూ దీన్ని వాడొచ్చని చెప్పారు. ఇది లాలాజల నమూనా ఆధారంగా పనిచేస్తున్నందువల్ల ప్రజలే సొంతంగా నమూనాలను సేకరించొచ్చని తెలిపారు. గొంతు, ముక్కు లోపలి నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉండదన్నారు.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని