Vaccine: ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?

మనదేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు ఇటీవల స్పుత్నిక్‌ వి టీకా అందుబాటులోకి వచ్చింది.

Published : 23 May 2021 11:58 IST

అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ కొవిడ్‌-19 బృందం 

దిల్లీ : మనదేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు ఇటీవల స్పుత్నిక్‌ వి టీకా అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ రెండు డోసుల టీకాలు. మొదటి డోసు తీసుకున్న 28 రోజులు, అంతకుమించిన గడువు తర్వాత రెండో డోసు టీకా తీసుకోవాలి. కానీ రెండో డోసు నాటికి అదే టీకా దొరకకపోతే.. బదులుగా వేరే టీకా అందుబాటులో ఉంటే, దాన్ని వేసుకోవచ్చా, అది పనిచేస్తుందా? దానివల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా? ఇవి ఎంతో మందిలో వ్యక్తమవుతున్న సందేహాలు. ఇదే విషయాన్ని అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 బృందం (వర్కింగ్‌ గ్రూపు) నిర్ణయించింది. ‘ఒకే వ్యక్తికి రెండు రకాల టీకాలు వేసే అంశంపై పరిశీలన ప్రారంభించబోతున్నాం. మరికొన్ని కొత్త టీకాలు రాగానే ఈ పని చేపడతాం’ అని కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూపు అధిపతి ఎన్‌కే అరోరా తెలిపారు. కొవిషీల్డ్, స్పుత్నిక్‌ వి లేదా కొవిషీల్డ్, కొవాగ్జిన్‌... ఇలా రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది నిర్థారించడమే ఈ పరిశీలన లక్ష్యమని వివరించారు. స్పెయిన్‌లో ఇప్పటికే నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మొదటి డోసు ఫైజర్‌ టీకా వేసుకుని, రెండో డోసు ఆస్ట్రజెనెకా టీకా వేసుకున్నప్పటికీ ఎటువంటి ముప్పు లేదని, పైగా బాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. యూకే, కెనడాల్లోనూ ఇటువంటి అధ్యయనాలు జరుగుతున్నాయి. ‘జులై నాటికి స్పుత్నిక్‌ వి టీకా లభ్యత మనదేశంలో బాగా పెరుగుతుంది, అప్పుడు ఈ టీకాను జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చుతాం’ అని అరోరా తెలిపారు. జైడస్‌ క్యాడిలా, నొవావ్యాక్స్, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని