Covid: భారత్, దక్షిణ అమెరికాల్లో ఉక్కిరిబిక్కిరి

భారత్, దక్షిణ అమెరికా, తదితర ప్రాంతాల్లో ఇటీవల విజృంభిస్తున్న కొవిడ్‌ కారణంగా ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి

Published : 24 May 2021 21:54 IST

ఐరాస సెక్రటరీ-జనరల్‌ గుటెరస్‌

ఐరాస: భారత్, దక్షిణ అమెరికా, తదితర ప్రాంతాల్లో ఇటీవల విజృంభిస్తున్న కొవిడ్‌ కారణంగా ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కళ్లముందు కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ-జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి ఇంకా మనతోనే ఉందని.. తీవ్రస్థాయిలో ఉంటూ ఉత్పరివర్తన చెందుతోందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘నేను కొవిడ్‌ ప్రారంభం నుంచీ చెబుతున్నాను.. ప్రతిఒక్కరూ సురక్షితమని తేలేదాకా ఎవరూ సురక్షితం కాదు. టీకాలు, పరీక్షలు, ఔషధాలు, ఆక్సిజన్‌ సరఫరా వంటివాటి విషయంలో అసమానతలున్నాయి. దీంతో పేద దేశాలు ఇక మహమ్మారి దయపైనే ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘మనమంతా ఇప్పుడు వైరస్‌తో యుద్ధం చేస్తున్నామన్నది సుస్పష్టం. అయితే ఇందుకు అవసరమయ్యే ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే స్థితికి ఇంకా మనం చేరుకోలేదు. వ్యాక్సిన్ల విషయంలోను.. కొవిడ్‌తో పోరుకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ ఇదే నిజం’’ అని గుటెరస్‌ అన్నారు. ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 17 కోట్ల (170 మిలియన్ల) డోసుల టీకాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. టీకా జాతీయవాదం, పరిమిత వ్యాక్సిన్‌ ఉత్పత్తి, నిధుల కొరత కారణంగా ఆ సంఖ్య 6.5 కోట్లకే పరిమితమైందన్నారు. జీ20 దేశాలు ముందుకొచ్చి టీకా ఉత్పత్తికి నిధులు అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా త్వరగా, సమగ్రంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టడం.. ప్రజారోగ్య ప్రమాణాలను కొనసాగించడం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన టీకా డోసుల్లో 82 శాతం సంపన్న దేశాలకే వెళ్లాయని.. అల్పాదాయ దేశాలకు కేవలం 0.3 శాతం టీకాలు మాత్రమే దక్కాయని అన్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వంటివాటితో కలిపి కార్యాచరణ చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మరోసారి కోరారు. ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా టీకాలు ప్రపంచవ్యాప్తంగా సమానంగా పంపిణీ అయ్యేలా ఇది పనిచేయాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని