టీకాలపై మేధో హక్కులు రద్దు చేయాలి

కరోనా వైరస్‌పై సమష్టి పోరుకు టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికాల ప్రతిపాదనకు అయిదు దేశాలతో కూడిన బ్రిక్స్‌ ..

Updated : 02 Jun 2021 13:24 IST

భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు బ్రిక్స్‌ దేశాల మద్దతు

దిల్లీ: కరోనా వైరస్‌పై సమష్టి పోరుకు టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికాల ప్రతిపాదనకు అయిదు దేశాలతో కూడిన బ్రిక్స్‌ మద్దతిచ్చింది. ప్రపంచ దేశాలన్నిటికీ టీకాలను సమంగా అందుబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సిన్ల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని ఆ ప్రతిపాదన పేర్కొంది. కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంపై బ్రిక్స్‌ సమావేశం విస్తృతంగా చర్చించింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగింది. ఆతిథ్య దేశ హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ భేటీకి అధ్యక్షత వహించారు. బహుళ ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలకు సమాన హోదా, అవకాశాలు ఉండాలని, సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని ప్రారంభ ఉపన్యాసంలో జైశంకర్‌ పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు విషయమై భారత్, చైనాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సమావేశానికి సభ్య దేశాల మంత్రులు హాజరయ్యారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందేనని సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రులు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలనుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలైన భద్రతా సమితి, సర్వప్రతినిధి సభ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థల్లో సమూల సంస్కరణలను డిమాండ్‌ చేస్తూ బ్రిక్స్‌ సమావేశం తీర్మానం చేయడం మరో కీలకమైన పరిణామం. ఏకాభిప్రాయంతో విడిగా సంయుక్త ప్రకటన వెలువరించడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల ప్రజల ప్రాణాల రక్షణకు టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. టీకాలపై మేధో హక్కుల్ని తాత్కాలికంగా రద్దు చేయాలని సంయుక్త ప్రకటన డిమాండ్‌ చేసింది. సాంకేతికత బదిలీ, స్థానికంగా టీకాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడం, వైద్య పరికరాల సరఫరా, ధరల విధానంలో పారదర్శకతకు బ్రిక్స్‌ సమావేశం పిలుపునిచ్చింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి స్థాపనకు ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర వహించాలని ప్రకటన పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని