Corona: నోటి శుభ్రతా కీలకమే..!

దంతాల ఆరోగ్యానికి.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కి మధ్య సంబంధం ఉందని కేరళ రాష్ట్ర ఐఎంఏ పరిశోధన విభాగం

Updated : 04 Jun 2021 09:53 IST

టీకాలతో దీర్ఘకాలిక రక్షణ 
 కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ వెబినార్‌లో వైద్యుల సూచనలు

ఈనాడు, దిల్లీ: దంతాల ఆరోగ్యానికి.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కి మధ్య సంబంధం ఉందని కేరళ రాష్ట్ర ఐఎంఏ పరిశోధన విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ జయదేవన్, ప్రొస్థోడాంటిస్ట్‌ డాక్టర్‌ నీతా రాణాలు తెలిపారు. పళ్లు, చిగుళ్లను సరిగా శుభ్రం చేసుకున్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి తక్కువ అవకాశం ఉంటుందని వివరించారు. కొవిడ్‌ టీకాలతో రక్షణ.. కరోనా తర్వాత మ్యుకర్‌మైకోసిస్‌ ఫంగస్‌ ముప్పు.. నోటి పరిశుభ్రత.. తదితర అంశాలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన వెబినార్‌లో వెల్లడించారు. వారేమన్నారంటే..

మ్యుకర్‌మైకోసిస్‌ ముప్పు...

మధుమేహ బాధితులకు కొవిడ్‌ సోకినప్పుడు.. దానికోసం స్టెరాయిడ్స్‌ ఉపయోగించడం అంటే రోగ నిరోధకశక్తిని మూడు మార్గాల్లో అణచివేసినట్లే. కొవిడ్‌ రోగుల్లో కొంతమంది మ్యుకర్‌మైకోసిస్‌ బారిన పడుతున్నారు. సాధారణంగా ఇది రోగ నిరోధశక్తి పూర్తిగా తగ్గిపోయినవారిలోనే కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు లేదా అవయవ మార్పిడి జరిగిన వారిలోనే ఇది ఎక్కువ ఉంటుంది. గత రెండు నెలలుగా ఇలాంటి అనారోగ్య సమస్యలు లేనివారిలోనూ మ్యుకర్‌మైకోసిస్‌ కనిపిస్తోంది. ఇది కొత్త మార్పు. ఈ విధంగా ఫంగస్‌ పెరగడానికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేయాల్సి ఉంది.

మధుమేహుల్లో ఇబ్బందులు..

మధుమేహ బాధితుల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకుండా పోతే రోగ నిరోధకశక్తి సరిగా పనిచేయదు. మధుమేహం తీవ్రమైనప్పుడు వ్యాధి కారకాలపై పోరాడేశక్తి శరీరంలోని కణాలకు తగ్గిపోతుంది. చక్కెర, జింక్‌ లాంటివి ఎక్కువైతే అవి ఈ ఫంగస్‌ పెరగడానికి దోహదపడతాయి. అలాగే మృత కణాలు పేరుకుపోయినా అందులోనూ ఫంగస్‌ పెరుగుతుంది. తర్వాతి దశలో ఫంగస్‌ మన రక్త కణాల్లోకి చొరబడుతుంది. అప్పుడు కణాలకు రక్తం అందక అవి మరణించి నల్లగా మారిపోతాయి. అందుకే మ్యూకర్‌మైకోసిస్‌ను ‘బ్లాక్‌ ఫంగస్‌’గా పిలుస్తుంటారు.

పళ్ల ఆరోగ్యంతో సంబంధం..

పళ్లు, చిగుళ్లను సరిగా శుభ్రం చేసుకున్నప్పుడు  వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సంభవించడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఏ కారణంగానైనా పళ్లు పీకిన తర్వాత ఏర్పడిన గాయాన్ని సరిగా మాన్పించకపోయినా, నోటిశుభ్రత సరిగా పాటించకపోయినా ఫంగస్‌ పెరగడానికీ ఎక్కువ అవకాశాలుంటాయి.

టీకాలతో రక్షణ

టీకా తీసుకున్నవారిలో కొవిడ్‌ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. మందులు వాడాల్సిన అవసరం ఉండదు. దీంతో స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ ముప్పు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అయితే స్వల్ప లక్షణాలతో ఉన్న కొవిడ్‌ దానంతట అదే తగ్గిపోయేలా చూసుకోకుండా.. ఎవరైనా స్వీయ వైద్యం చేసుకొని, అవసరం లేని మందులు వాడితే అప్పుడు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఉండే అవకాశం ఉంది.
ఎవరికైనా వెంటవెంటనే ఇన్‌ఫెక్షన్‌ సోకినా, వ్యాక్సినేషన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అప్పటికే తయారైన మెమొరీ సెల్స్‌ తక్షణం కార్యాచరణలోకి దిగుతాయి. పలు అధ్యయనాల ప్రకారం మెమొరీ సెల్స్‌ ఏడాది వరకు ఉంటాయి. టీకాలు రోగం తీవ్రం కాకుండా, మరణం సంభవించకుండా అడ్డుకుంటాయి. వీటి రక్షణ దీర్ఘకాలం ఉంటుందని, అది కొన్నేళ్ల వరకు మనల్ని కాపాడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని