China: మంచు కొండల్లో డ్రాగన్‌ వణుకు

హిమాలయాల్లో విధులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడి దేశ సరిహద్దుల్లో గస్తీ తిరగడం పెద్ద సవాలు.

Published : 07 Jun 2021 11:17 IST

భారత సరిహద్దు నుంచి పలువురు వెనక్కి!

దిల్లీ: హిమాలయాల్లో విధులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడి దేశ సరిహద్దుల్లో గస్తీ తిరగడం పెద్ద సవాలు. ఈ విషయంలో భారత సైన్యానికి చైనా సరితూగడం లేదు. ప్రతికూల వాతావరణం, ఎముకలు కొరికే చలికి ఆ దేశ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. చలికాలంలో పలు రకాలుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది దేశ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది సైనికులను ఆ దేశం మోహరించింది. వారిలో 90 శాతం మంది తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దాంతో దేశంలోని ఇతర స్థావరాల్లో ఉంటున్న రిజర్వు దళాలను ఇక్కడికి పంపించింది. రొటేషన్‌ పద్ధతిలో సైనికులను మోహరించాల్సి వస్తోంది. దాంతో 90 శాతం మంది సైనికులను ఎప్పటికప్పుడు మార్చి వేస్తోందని భారత ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. గస్తీ కాస్తున్న జవాన్లను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.

భారత్‌ కూడా సైనికులను మార్చుతుంటుంది. అయితే ప్రతి జవాను లద్దాఖ్‌లో కనీసం రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రొటేషన్‌లో భాగంగా ప్రతి ఏటా 40-50 శాతం మంది సైనికులను ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించి, అక్కడి వారిని తీసుకొస్తుంటుంది. మంచుకొండల్లో యుద్ధం చేయడం, గస్తీ కాయడంపై బలగాలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ విషయంలో భారత్‌ ఆరితేరింది. ప్రస్తుతం చైనా కూడా ఇదే పనిచేస్తోంది. భారత్‌ భూభాగానికి గంటల్లో చేరుకునేలా కసరత్తులు ప్రారంభించింది. ప్రతిగా భారత్‌ కూడా కీలక స్థానాల్లో బలగాలను మోహరించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న భారత్‌ సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే లద్దాఖ్‌కు స్వయంగా వెళ్లి బలగాలకు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ సైన్యానికి తగిన సమాచారం అందిస్తున్నారు. చైనా అధ్యయన బృందం త రచూ సమావేశమయి సైన్యానికి మార్గదర్శనం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని