Mars: ఈ మట్టి బంగారంగానూ..

ఈ మట్టి ముందు పుత్తడి విలువ దిగదుడుపే! కారణం... ఇది అంగారక గ్రహం

Updated : 08 Jun 2021 12:58 IST

 పసిడి కన్నా 2 లక్షల రెట్లు విలువ

అంగారకుడి నుంచి కిలో నమూనాల సేకరణకు అయ్యే వ్యయమిది

వాషింగ్టన్‌: ఈ మట్టి ముందు పుత్తడి విలువ దిగదుడుపే! కారణం... ఇది అంగారక గ్రహం  నుంచి తెచ్చేది కాబట్టి. అక్కడి నుంచి కిలో మట్టిని తెచ్చేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) భారీగా ఖర్చుపెడుతోంది. అది సాకారమైతే భూమిపైనే అత్యంత ఖరీదైన పదార్థంగా ఈ నమూనా నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది పరిశీలించేందుకు అక్కడి నుంచి కిలో మట్టి నమూనాలను నాసా రప్పిస్తోంది. ఇందుకు మొత్తం 900 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. భారీ వ్యయం కారణంగా.. ఇది చాలా ఖరీదైన పదార్థంగా మిగిలిపోనుంది. కిలో బంగారం ధర కన్నా... అంతే పరిమాణంలో ఉండే ఈ మట్టి ధర ఏకంగా 2 లక్షల రెట్లు ఎక్కువ! ఈ నమూనాలపై అనేక పరిశోధనలు చేపడతారు. ఇప్పటివరకూ అంగారకుడి ఉపరితల నమూనాలను అక్కడి రోవర్లు పరిశోధించాయి. ఆ మట్టిని భూమికి తెప్పించడం ఇదే మొదటిసారి. 

ఎందుకంత ఖర్చు?

అంగారక నమూనాలను రప్పించే ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది. మొదటి యాత్రలో ప్రయోగించిన పర్సెవరెన్స్‌ రోవర్‌.. అరుణగ్రహ ఉపరితలాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నమూనాలను సేకరిస్తుంది. రెండో దశలో వెళ్లే వ్యోమనౌక.. ఆ నమూనాలను ఒక లాంచర్‌లో ఉంచుతుంది. మూడో వ్యోమనౌక దాన్ని భూమికి తీసుకొస్తుంది. నమూనాల సేకరణను 2023లో పర్సెవరెన్స్‌ పూర్తి చేస్తుంది. అయితే వాటిని భూమికి రప్పించడానికి దశాబ్దంపైనే పడుతుంది. పర్సెవరెన్స్‌ రోవర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపైనున్న జెజెరో బిలంలో దిగింది. ఒకప్పుడు అక్కడ ఒక భారీ సరస్సు ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 100 కోట్ల ఏళ్ల కిందట అది అదృశ్యమై ఉంటుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని