Unlock: రాష్ట్రాల్లో ‘అన్‌లాక్‌’.. ఎక్కడ ఎలా?

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. క్రమేపీ పలు రాష్ట్రాలు ‘అన్‌లాక్‌’ ప్రక్రియను మరింత విస్తరించాయి.  

Published : 14 Jun 2021 11:23 IST

దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. క్రమేపీ పలు రాష్ట్రాలు ‘అన్‌లాక్‌’ ప్రక్రియను మరింత విస్తరించాయి.  సోమవారం నుంచి చాలామేర లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడానికి నిర్ణయించాయి. పలుచోట్ల ప్రభుత్వాలు జిల్లాల వారీగా ‘అన్‌లాక్‌’ను అమలు చేస్తున్నాయి.
*దిల్లీలో సోమవారం నుంచి 50% సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. వారపు మార్కెట్లను, మతపరమైన ప్రాంతాలనూ తెరిచేందుకూ అనుమతించారు. లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌ 19 నుంచి మూతపడిన సెలూన్లు, బ్యూటీ పార్లర్లను కూడా తెరుస్తారు. ఇంతవరకు సరి-బేసి విధానంలో నడుస్తున్న మార్కెట్లు, మాల్స్, మార్కెట్‌ సముదాయాలను ఇకపై ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంచుతారు. 
తమిళనాడులోని 27 జిల్లాల్లో పలు నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రకటించారు. విస్తృతంగా ఉన్న టీ దుకాణాలతో పాటు, సెలూన్లు, పార్కులు, ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే రాష్ట్ర పశ్చిమ, కావేరీ డెల్టా ప్రాంతాల్లోని 11 జిల్లాల్లో మాత్రం నిబంధనలు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను కూడా నడపరు.
కర్ణాటకలోని 11 జిల్లాల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇక్కడ పార్కులు, పారిశ్రామిక యూనిట్లు వంటివాటిని తెరుస్తున్నారు. 
జమ్మూ-కశ్మీర్‌లో 8 జిల్లాల్లో నిబంధనలను సడలించారు. 
అస్సాంలో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ రెండు డోసుల టీకాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
మధ్యప్రదేశ్‌లో ఈ నెల 15 లోపు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అయితే వివాహాలకు ఇంతవరకు 20 మందినే అనుమతిస్తుండగా ఆ సంఖ్యను తాజాగా 40కి పెంచారు.
ఒడిశా ఈ నెల 17 నుంచి దశలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.
* పంజాబ్‌లో సాయంత్రం 6 వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
నాగాలాండ్‌ ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలిస్తూ ఈ నెల 18 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది.
గోవాలో కరోనా కర్ఫ్యూని ఈ నెల 21 వరకు పొడిగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని