Mask: వైరస్‌ను అంతం చేసే మాస్కు

వైరస్‌ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన

Updated : 15 Jun 2021 13:09 IST

త్రీడీ ముద్రణ సాయంతో రూపొందించిన పుణె సంస్థ 

దిల్లీ: వైరస్‌ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసింది. త్రీడీ ముద్రణ, ఔషధ పరిజ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఈ ఘనత సాధించింది. థింకర్‌ టెక్నాలజీస్‌ ఇండియా సంస్థ ఈ మాస్కును రూపొందించింది. దానికి యాంటీవైరల్‌ పూతను పూశారు. ఈ తరహా రసాయనాలను వైరుసైడ్స్‌ అని కూడా పిలుస్తుంటారు. సోడియం ఒలెఫిన్‌ సల్ఫోనేట్‌ ఆధారిత మిశ్రమంతో దీన్ని తయారుచేశారు. ఇందులోని పదార్థాలన్నీ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటాయి. వీటిని సబ్బులు, సౌందర్య లేపనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. తనను తాకిన వైరస్‌లను ఈ పూత నిర్వీర్యం చేస్తుంది. వైరస్‌ వెలుపలి పొరలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అడ్డుకుంటుంది. ఈ రసాయనం.. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కూడా నిర్వీర్యం చేయగలదని పరీక్షల్లో రుజువైంది.

ఈ మాస్కుల ప్రాజెక్టును వాణిజ్యపరంగా వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు(టీడీబీ) ఎంపికచేసింది. ‘‘ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించాం. అయితే ఎక్కువ మంది వినియోగిస్తున్న మాస్కుల నాణ్యత తక్కువగా ఉందని కూడా గమనించాం. ఈ నేపథ్యంలో అత్యంత నాణ్యమైన ముఖ తొడుగులను రూపొందించాలనుకున్నాం. ఈ దిశగా వైరుసైడల్‌ పూత పూసిన మాస్కులను అభివృద్ధి చేశాం. దీని ధర కూడా తక్కువే’’ అని థింకర్‌ సంస్థ డైరెక్టర్‌ షీతల్‌ కుమార్‌ జాంబాద్‌ తెలిపారు. ఈ వినూత్న మాస్కులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని