Choksi: చోక్సీ ముంచింది రూ.6,344కోట్ల పైనే

వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ.6,344.96 కోట్లకు పైగా మోసం చేశారని సీబీఐ

Updated : 17 Jun 2021 09:54 IST

 వెల్లడించిన సీబీఐ 

దిల్లీ: వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ.6,344.96 కోట్లకు పైగా మోసం చేశారని సీబీఐ తాజా అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది. లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌ఓయూ), ఫారిన్‌ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎఫ్‌ఎల్‌సీ) పత్రాలను ఉపయోగించి మోసాలకు తెరతీశారని తెలిపింది. ఈ కుట్రకు పీఎన్‌బీ ఉద్యోగులు కూడా సహకరించారని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి తొలి అభియోగపత్రంలో 18 మందిని నిందితులుగా చేర్చిన సీబీఐ, తాజా ఛార్జిషీటులో మరో నలుగురి పేర్లు చేర్చింది. వారిలో గీతాంజలి సంస్థల మాజీ అంతర్జాతీయ అధిపతి సునీల్‌ వర్మ, నక్షత్ర సంస్థ డైరెక్టర్‌ ధనేష్‌ సేథ్‌తో పాటు ఇద్దరు పీఎన్‌బీ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. మూడేళ్ల దర్యాప్తులో బయటపడ్డ వివరాలతో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రం ప్రకారం.. బ్రాడీ శాఖలోని పీఎన్‌బీ ఉద్యోగులు 2017 మార్చి-ఏప్రిల్‌ మధ్య 165 ఎల్‌ఓయూ, 58 ఎఫ్‌ఎల్‌సీ పత్రాలను చోక్సీకి చెందిన సంస్థల పేరిట జారీ చేశారు. వాటికి నగదు పరిమితిని కూడా విధించలేదు. ఆడిట్‌ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఈ వివరాలను పీఎన్‌బీ కేంద్రీకృత బ్యాంకింగ్‌ వ్యవస్థలో నమోదు చేయలేదు. ఆ పత్రాల ద్వారా వివిధ దేశాల్లోని పలు బ్యాంకులు చోక్సీ సంస్థలకు రుణాలు మంజూరు చేశాయి. అయితే వాటిని చోక్సీ ఉద్దేశపూర్వకంగానే తిరిగి చెల్లించలేదు. దీంతో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పీఎన్‌బీ చెల్లించాల్సి వచ్చింది. 2014, 2015, 2016ల్లో జారీ చేసిన ఎల్‌ఓయూ, ఎఫ్‌ఎల్‌సీలపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తోంది. అది పూర్తయ్యాకే పీఎన్‌బీకి జరిగిన నష్టం ఎంతో తేలనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని