Vaccine: ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం 

ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకాలను కేటాయించనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది.

Published : 22 Jun 2021 10:12 IST

 భారత్‌ తదితర ఆసియా దేశాలకు 1.6 కోట్లు  

 టీకాలపై అమెరికా ప్రకటన 

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకాలను కేటాయించనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్‌ వంటి ఆసియా దేశాలకు 1.6 కోట్ల డోసులను ఇస్తామని తెలిపింది. అమెరికాలోని జో బైడెన్‌ సర్కారు ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది. తాజా ప్రకటనతో ఆ కేటాయింపు 8 కోట్ల డోసులకు చేరుతుంది. ‘‘స్వదేశంలో ఈ మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ముగింపు పలికేందుకు కృషి చేస్తాం. ప్రపంచానికి ‘టీకాల ఆయుధాగారం’గా అమెరికాను మారుస్తామని బైడెన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా దేశీయ సరఫరా నుంచి వ్యాక్సిన్లను విరాళంగా ఇస్తాం. ఈ నెల చివరినాటికి 8 కోట్ల డోసులను కేటాయించాలని బైడెన్‌ హామీ ఇచ్చారు’’ అని అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌’ పేర్కొంది. ఈ టీకాల్లో 75 శాతాన్ని ‘కొవాక్స్‌’ కింద అందించనున్ననట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టీకా కవరేజీని పెంచడమే తమ ఉద్దేశమని వివరించింది. తద్వారా కేసుల సంఖ్య పెరగకుండా చూడాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించింది. ఇతర దేశాల నుంచి ప్రయోజనాలను పొందేందుకు ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉపయోగించుకోబోమని పేర్కొంది. ప్రపంచ దేశాలకు అందించడానికి వీలుగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా తయారీదారులతో కలిసి కసరత్తు సాగించనున్నట్లు తెలిపింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని