న్యాయవాదులపై దాడిచేస్తే 5 ఏళ్ల శిక్ష

న్యాయవాదులపై దాడిచేస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష,

Published : 25 Jun 2021 13:22 IST

రెండోసారి తప్పుచేస్తే పదేళ్లవరకు ఖైదు

బార్‌ కౌన్సిల్‌ ముసాయిదా బిల్లు

ఈనాడు, దిల్లీ: న్యాయవాదులపై దాడిచేస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించాలని బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ‘న్యాయవాదుల పరిరక్షణ బిల్లు-2021’ ముసాయిదా ప్రతిపాదించింది. తెలంగాణలో న్యాయవాది గట్టు వామనరావు, సతీమణి నాగమణిలు ఈ ఏడాది ఫిబ్రవరిలో  పట్టపగలు నడిరోడ్డుపై హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో న్యాయవాదుల రక్షణ అంశం తెరమీదికి వచ్చింది. ఇందుకోసం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల కమిటీ అడ్వొకేట్స్‌ ప్రొటెక్షన్‌ 2021 బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ ఎ.రామిరెడ్డి కూడా పాలుపంచుకున్నారు.

ఇవన్నీ దాడి కిందికే వస్తాయి 

న్యాయవాదులు వృత్తి బాధ్యతలు నిర్వర్తించకుండా అసాంఘిక శక్తులు వారిపై దాడిచేయడం, నేరపూరితంగా బెదిరించి ఒత్తిడి చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయినందున అలాంటివారిపై ఈ బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదించింది. వేధింపులు, బెదిరింపులు, దాడి, నేరపూరిత ఒత్తిడి, ప్రాణానికి ముప్పు కల్గించేలా, విధులకు అడ్డంకులు కల్పించేలా బెదిరింపులు చేయడం, హానికరమైన గాయాలు చేయడం, కోర్టు ప్రాంగణంలోనే ముప్పు తలపెట్టడం, వకాల్తా ఉపసంహరించుకోమని ఒత్తిడి చేయడం, కోర్టు ముందు హాజరుకాకుండా అడ్డుకోవడం, ఆస్తులు, డాక్యుమెంట్లు, మెటీరియల్‌ను ధ్వంసం చేయడం, న్యాయప్రక్రియ సమయంలో అసభ్యభాష ప్రయోగించడంలాంటివన్నీ న్యాయవాదులపై దాడి కిందికే వస్తాయని ఈ బిల్లులో ప్రతిపాదించారు. తొలిసారి  ఇలాంటి నేరానికి పాల్పడినవారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా, రెండోసారి అదే తప్పుచేసిన వారికి ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ కేసులను ఎస్పీ ర్యాంకు స్థాయి అధికారి దర్యాప్తు చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదైన నాటినుంచి 30 రోజుల్లోపు విచారణ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ముప్పు ఉన్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించేలా నిబంధన రూపొందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని