
France: అవును.. ఆ రాక్షసుణ్ని కాల్చి చంపా
గృహహింసపై గర్జించిన ఫ్రాన్స్ వనిత
వెల్లువలా ప్రజాబలం.. విడుదల చేసిన కోర్టు
ప్యారిస్: ‘అవును.. నేను అతణ్ని చంపాను. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నా పిల్లలే చేసేవాళ్లు’ అంటూ వలేరీ బాకోట్(40) కోర్టులో గర్జించింది. ఆ గళంలో ధిక్కారం కంటే అంతులేని విషాదం నుంచి బయటపడ్డ అబల ఆక్రందన ఉంది. అది విన్న న్యాయస్థానం సానుభూతితో ఆమె దీనగాధను అర్థం చేసుకుంది. నాలుగేళ్ల జైలుశిక్షను ఏడాదికి కుదిస్తూ.. ఆ శిక్షాకాలం కూడా అప్పటికే పూర్తయినందున ‘నువ్విక స్వేచ్ఛాజీవి’ అంటూ శుక్రవారం జూన్ 25న బాకోట్ను విడుదల చేసింది. వేలాది ప్రజాగొంతుకలు హర్షం వ్యక్తం చేశాయి. ఓ నరరూప రాక్షసుణ్ని చంపిన ఆమెను విడుదల చేయాలంటూ 7,10,000 సంతకాలతో ప్రజలు కోర్టుకు పెట్టుకున్న పిటిషన్ గురించి విన్న అంతర్జాతీయ సమాజం కూడా ఆమెకథ వినేందుకు ఇపుడు ఆసక్తి చూపుతోంది.
నలుగురు పిల్లల తల్లి ఫ్రెంచి వనిత వలేరీ బాకోట్. ఆ పిల్లల తండ్రి ఆమె మారుతండ్రే. 1992 ప్రాంతంలో.. మగదిక్కు లేని బాకోట్ తల్లికి దగ్గరైన డేనియల్ పొలెట్ట్ అప్పటికి పన్నెండేళ్ల వయసులో ఉన్న ఈమెపై కన్నేశాడు. అన్నెం పున్నెం ఎరుగని ఆ కౌమారదశ నుంచి మొదలుపెట్టి దాదాపు పాతికేళ్లు బాకోట్పై అత్యాచారాలు జరుపుతూ శారీరకంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. ఈ క్రమంలో ఆమెకు నలుగురు పిల్లలు పుట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాకోట్ తన చేయి దాటిపోకుండా పూర్తిగా నిఘా పెట్టాడు. తిరగబడితే తుపాకితో బెదిరించాడు. చివరకు ఆమెను వేశ్యగా కూడా మార్చాడు. తనకంటే పాతికేళ్లు వయసులో పెద్దవాడైన డేనియల్ పొలెట్ట్ అకృత్యాలన్నీ ఏళ్లతరబడి సహించిన బాకోట్ 14 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెను కూడా వేశ్యగా మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం సహించలేకపోయింది. భర్త రూపంలో ఉన్న ఆ రాక్షసుణ్ని తుపాకితో కాల్చి చంపింది. పిల్లలు ఆమెకు మద్దతుగా నిలిచారు. చివరకు డేనియల్ పొలెట్ట్ తోబుట్టువులు కూడా ఆమెకే మద్దతు పలికారు. 2016లో ఈ సంఘటన జరిగింది. తన నేరం అంగీకరించిన బాకోట్కు సెంట్రల్ ఫ్రాన్స్‌లోని చలోన్ సర్ సావన్ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. విచారణ అనంతరం ఆమె పెరోల్‌పై విడుదలైంది. ఈ సందర్భంగా ‘టాట్ లే మోండే సవాయిట్’ (ఎవరీవన్ న్యూ ఇట్) పేరిట బాకోట్ రాసిన తన ఆత్మకథ ఫ్రాన్స్ సమాజాన్ని ఓ ఊపు ఊపింది. వెల్లువలా తోడైన ప్రజాబలం న్యాయస్థానం ఆమెను విడుదల చేసేందుకు దోహదపడింది.