Covid: మావోయిస్టు పార్టీపై కరోనా పంజా!

అడవుల్లో అజ్ఞాతంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో సతమతమవుతున్నారా?

Published : 29 Jun 2021 09:44 IST

దెబ్బతీస్తున్న ఇతర అనారోగ్యాలు 
నెల వ్యవధిలో ఆరుగురు నేతల మృతి

ఈనాడు, హైదరాబాద్‌: అడవుల్లో అజ్ఞాతంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో సతమతమవుతున్నారా? క్యాడర్‌ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి కార్యకలాపాలు తగ్గించుకున్నా.. ఈ కొత్త ముప్పు, ఇతర అనారోగ్యాలు మావోయిస్టులను దెబ్బతీస్తున్నాయా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా ఈ క్యాడర్‌లో తెలంగాణ వారి ప్రాతినిధ్యం తగ్గిపోతుండగా.. ఈ నెలలో ఈ ప్రాంత నేతల వరుస మరణాలు ఆ పార్టీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంచనావేస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే కరోనాతో నలుగురు చనిపోగా, ఒకరు గుండెపోటుతో, ఇంకొకరు పోలీసు కాల్పుల్లో మరణించారు. మరో 20 మంది కొవిడ్‌ బారినపడినట్లు సమాచారం. కొన్ని సంవత్సరాలుగా అడవులకే పరిమితం కావడం, సరైన ఆహారం లేకపోవడం, వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మావోయిస్టు పార్టీలో ఈ ఏడాది మొదట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు వివిధ స్థాయిల్లో 145 మంది వరకూ ఉన్నారు. వీరిలో సగం మందికిపైగా వయోభారంతో క్షేత్రస్థాయి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాల కమిటీల బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీలో దాదాపు వంద మంది ఉండగా వారిలో 85 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే. 15 మంది మాత్రమే తెలంగాణ వారు. రాష్ట్రంలో క్యాడర్‌ని పెంచేందుకు, కొత్త నియామకాలకు మైలారపు భాస్కర్‌ అలియాస్‌ ఆదెల్లు ఆధ్వర్యంలో గత ఏడాది తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆసిఫాబాద్, భూపాలపల్లిలో భాస్కర్‌ స్వయంగా అనేకమార్లు పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది మావోయిస్టులు చనిపోయారు. వారంతా ఛత్తీస్‌గఢ్‌ వారే. ఈ ఉదంతం నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. మావోయిస్టులపై పోరాటంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఏరికోరి ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో కొత్త క్యాడర్‌ సంగతి పక్కనపెట్టి ఉన్నవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టులు క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చారు. ఈలోపు కరోనా రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. 
* కరోనా సోకి చికిత్స కోసం వస్తుండగా ఈ నెల మొదటి వారంలో డివిజన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ వరంగల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో మరణించాడు.
ఆ తర్వాత వరుసగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్, ఆయన భార్య శారదక్క, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్‌ భారతక్క కరోనాతో మరణించారు. 
కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించారు. 
* ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో తెలంగాణకు చెందిన డివిజన్‌ కమిటీ సభ్యుడు సందె గంగయ్య ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని