Arcitic: చివరిగడ్డ కరుగుతోంది!

పర్యావరణ మార్పుల ప్రభావం పట్టణాలనే కాదు... భూమి అంచులనూ చేరుతోంది!

Updated : 04 Jul 2021 11:28 IST

పర్యావరణ మార్పుల ప్రభావం పట్టణాలనే కాదు... భూమి అంచులనూ చేరుతోంది! గాలి సైతం గడ్డకట్టేంత చలి ఉండే... ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచంతా కరిగినా... ఇక్కడ మాత్రం ఫర్వాలేదని శాస్త్రవేత్తలు ధైర్యంగా నమ్మిన ‘చివరి మంచు ప్రాంతం’ కూడా ఇప్పుడు పర్యావరణ ప్రభావానికి లోనవుతోంది! 

ఎక్కడుందీ ప్రాంతం?

పర్యావరణ మార్పులిలాగే కొనసాగితే... మంచుతో నిండి ఉండే ఆర్కిటిక్‌లో 2040నాటికి... వేసవి మంచు అంతా కరిగిపోతుందని 2015లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇలా అంతాకరిగినా... ఒక చోటు మాత్రం పర్యావరణ మార్పులను తట్టుకొని నిలబడుతుందని... ఇక్కడిదాకా ఆ ప్రభావం పడకపోవచ్చని భావించారు. అదే- ఉత్తర గ్రీన్‌లాండ్‌లోని చివరి మంచు ప్రాంతం! 

ఏంటి ప్రాధాన్యం?

ఇక్కడి వేసవి సముద్ర మంచు (సముద్ర ఉపరితలం గడ్డకట్టడం) ఇక్కడి జీవజాలానికి చాలా అవసరం! వేసవిలో మిగిలిన చోట్ల మంచు కరిగినా మంచులో జీవించే జంతుజాలాలు ఇక్కడికి చేరుకుంటాయి. మంచు ఎలుగుబంట్ల నుంచి సీల్స్‌ దాకా ఎన్నింటికో ఇది వేసవిలో ఆవాసం.

 ఇప్పుడేమైంది?

ఇలా పర్యావరణంలో ఎంతో కీలకమైన ఈ ప్రాంతంపైనా ప్రభావం పడుతోంది. ఇక్కడి వేసవి మంచు మందం కరిగిపోతోందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు తేల్చారు. గతంలో కంటే తక్కువ మందంలో మంచు కనిపిస్తోంది.  2018లో దీనికి సంబంధించి కన్పించిన తొలి సంకేతాలు ఇప్పుడు... ఇంకా ఎక్కువ అయ్యాయని... మిగిలిన ఆర్కిటిక్‌లాగే ఇక్కడా కరుగుతోందని వారు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. గతంకంటే 50శాతం మాత్రమే గడ్డకట్టిందని, కొన్ని చోట్ల మంచు కరిగి, సముద్ర నీరు కనిపిస్తోందని, పరిశోధక బృందం సారథి ఆక్సెల్‌ ష్వేగర్‌ తెలిపారు. పర్యావరణ ప్రభావం ఇలాగే కొనసాగితే... ఇక్కడి జీవజాలానికే కాకుండా... 2050 కల్లా చాలా సముద్రతీర పట్టణాలు, ప్రాంతాలకు ముప్పు (మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరుగుతాయి) ముంచుకొస్తున్నట్లేనన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక!

- ఈనాడు ప్రత్యేకవిభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు