అక్కడ మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!

బ్రిటన్‌లో ఇక మాస్కు పెట్టుకోవడం ప్రజల ఇష్టానికే వదిలేసే రోజులు రానున్నాయి.

Updated : 05 Jul 2021 11:52 IST

 కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేసే యోచనలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: బ్రిటన్‌లో ఇక మాస్కు పెట్టుకోవడం ప్రజల ఇష్టానికే వదిలేసే రోజులు రానున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతున్న నేపథ్యంలో దేశంలో ఈనెల 19 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేసేందుకు ప్రధాని సిద్ధమవుతున్నట్లు బ్రిటన్‌ మీడియాలో వార్తలొచ్చాయి. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఆంక్షలను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేయకుండా కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు బ్రిటన్‌ గృహనిర్మాణ శాఖ మంత్రి రాబర్ట్‌ జెన్‌రిక్‌ ఆదివారం తెలిపారు. పలు కొవిడ్‌ నిబంధనలు ఇక ఐచ్ఛికమేనని వచ్చేవారంలోనే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటిస్తారని బ్రిటన్‌ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ వ్యాక్సిన్‌ కార్యక్రమం విజయవంతం అవుతోందన్నారు. ‘‘ఇప్పుడు నిబంధనలను ఎత్తివేసేందుకు, వీలయినంతమేర సాధారణ జీవనం సాగించే పరిస్థితులు తిరిగి రావడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకొనే ఓ విభిన్న కాలానికి మనమంతా వెళుతున్నాం’’ అని అన్నారు. చాలామంది ప్రజల్లాగే తాను కూడా వీలయినంత త్వరగా ఈ నిబంధనల నుంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘కొవిడ్‌ ఆంక్షలు లేని కాలానికి మనమంతా వెళుతున్నాం. అయితే మీరేం చేయాలో ప్రభుత్వం చెప్పదు. మీకు మీరే వ్యక్తిగత బాధ్యత తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. ఈ దిశగా నిర్ణయానికి రావాలి’’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.

మరోవైపు ‘స్వేచ్ఛా కాలం’ దిశగా ముందుకెళుతూ.. భౌతిక దూరం సహా పలు నిబంధనలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్‌ ప్రధాని ఉన్నట్లు ‘ది సండే టైమ్స్‌’ పేర్కొంది. ‘‘బార్లు, రెస్టారెంట్లు, హెయిర్‌ డ్రెస్సర్లు, జిమ్, మ్యూజియం వంటి వాటిలోకి వెళ్లేందుకు స్కాన్‌ చేసే నిబంధనలను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. అలాగే స్వదేశీ కొవిడ్‌-19 పాస్‌పోర్టు ప్రతిపాదనలనూ జాన్సన్‌ తిరస్కరించారు. ఇప్పుడు కొవిడ్‌తో సహజీవనం సాగించడం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి’’ అని ఆ పత్రిక పేర్కొంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts