Covid: కడుపు కొట్టిన కరోనా!

కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నానా రకాలుగా కుంగదీస్తోంది.

Updated : 13 Jul 2021 13:20 IST

2020లో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆహారలేమి

కొవిడ్‌ మహమ్మారే ప్రధాన కారణం.. ఐరాస నివేదిక  

రోమ్‌: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నానా రకాలుగా కుంగదీస్తోంది. తిండికీ నోచుకోని అభాగ్యుల సంఖ్యను పెంచేసింది. గత ఏడాది ఆకలి సమస్య మరింత తీవ్రమైందని ఐరాస పేర్కొంది. కరోనా విజృంభణే ప్రధాన కారణమని తెలిపింది. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని వివరించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మందికి పోషకాహార లోపం ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు సంవత్సరం అది 8.4 శాతంగా ఉండేదని తెలిపింది. ఐరాసకు చెందిన ఐదు సంస్థలు సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ ఆందోళనకర వివరాలు ఉన్నాయి. అందులోని ప్రధానాంశాలివీ.. 

ప్రధానంగా ఆఫ్రికాలో క్షుద్బాధ దారుణంగా పెరిగింది. అక్కడ 21 శాతం మందికి పౌష్టికాహార లోపం ఉంది. 

ఆహారం లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఐదేళ్ల లోపు వయసున్న దాదాపు 14.9 కోట్ల మందిలో శారీరక ఎదుగుదల బాగా తక్కువగా ఉంది. 4.5 కోట్ల మంది పిల్లలు చాలా తక్కువ బరువును కలిగి ఉన్నారు.   

మొత్తంమీద 3 వందల కోట్ల మంది పెద్దలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం.. అందని ద్రాక్షగానే ఉంది. అధిక ధరలే ఇందుకు కారణం. 

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహమ్మారి వల్ల తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యం తలెత్తింది. ఫలితంగా ఆహార లభ్యత తగ్గిపోయింది. నిజానికి కరోనా విజృంభణకు ముందు నుంచే ఆకలి సమస్య పెరుగుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు మందగమనంలో సాగుతున్నాయి.

మరోవైపు 3.9 కోట్ల మంది చిన్నారులకు ఊబకాయం ఉంది. 

2030 నాటికి ప్రపంచంలో క్షుద్బాధను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస లక్ష్యానికి కరోనా గండికొట్టేలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే 2030 నాటికి ఇంకా 66 కోట్ల మంది ఆకలి కోరల్లో విలవిలలాడుతుంటారు. అందులో దాదాపు 3 కోట్ల మంది.. కరోనా మహమ్మారి వల్ల ఉత్పన్నమయ్యే దీర్ఘకాల ప్రభావాలను ఎదుర్కొనేవారే. 

ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఏడీ), యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లు ఈ నివేదికను రూపొందించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని