Space Tour: రోదసిలోకి చిన్నా-పెద్దా 

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఈ నెల 20న నిర్వహించే అంతరిక్ష యాత్రలో రెండు అరుదైన రికార్డులు

Updated : 17 Jul 2021 15:04 IST

చరిత్ర సృష్టించనున్న ఆలివర్, వేలీ  

వాషింగ్టన్‌: అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఈ నెల 20న నిర్వహించే అంతరిక్ష యాత్రలో రెండు అరుదైన రికార్డులు నమోదు కానున్నాయి. ఈ కుబేరుడితో కలిసి 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌ రోదసియాత్ర చేయబోతున్నారు. దీంతో అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందబోతున్నారు. అదే యాత్ర కోసం ఇప్పటికే ఎంపికైన వేలీ ఫంక్‌ (82).. అత్యంత ఎక్కువ వయసున్న వ్యోమగామి కానున్నారు. 

ఈ యాత్ర కోసం బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ అంతరిక్ష సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 2.8 కోట్ల డాలర్లకు ఓ ధనికుడు టికెట్‌ సంపాదించారు. అయితే ఇతరత్రా పనుల కారణంగా ఆయన తన యాత్రను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆ సీటును ఆలివర్‌కు కేటాయించారు. ఇందుకు ఆ కుర్రాడు ఎంత చెల్లించాడన్నది ఇంకా వెల్లడి కాలేదు. ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఈ యాత్ర నిర్వహించనున్నారు. 2020లో హైస్కూలు చదువును పూర్తిచేసుకున్న ఆలివర్‌.. ప్రైవేటు పైలట్‌ లైసెన్సు కోసం ఏడాది పాటు చదువుకు బ్రేక్‌ ఇచ్చారు. నెదర్‌లాండ్స్‌లోని ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయంలో చేరనున్నారు. 

ప్రస్తుతం.. రోదసిలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కుడిగా సోవియట్‌ వ్యోమగామి ఘెర్మోన్‌ టిటోవ్‌ గుర్తింపు పొందారు. 1961లో రోదసి యాత్ర చేసినప్పుడు ఆయన వయసు 25 ఏళ్లు. ఈ రికార్డును ఆలివర్‌ అధిగమించనున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని