Unlock: దశలవారీగా పాఠశాలలు తెరవాలి

దేశంలోని పాఠశాలలను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్‌ సంచాలకుడు రణ్‌దీప్‌ గులేరియా సూచించారు.

Published : 20 Jul 2021 12:00 IST

 భారతీయ చిన్నారుల్లో అధిక రోగనిరోధక శక్తి: గులేరియా

దిల్లీ: దేశంలోని పాఠశాలలను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్‌ సంచాలకుడు రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని దేశం పరిశీలించాలని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో గతేడాది మార్చిలో తొలి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి దేశంలో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరగతులను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో పాఠశాలలను దశలవారీగా తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘‘వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశానికి నేను ప్రతిపాదకుడిని’’ అని గులేరియా వ్యాఖ్యానించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న చోట్ల దీన్ని (పాఠశాలలు తెరిచే అంశాన్ని) అమలు చేయాలని సూచించారు. ఒకవేళ వైరస్‌ సోకడం పెరుగుతున్నట్లు గుర్తించగానే పాఠశాలలను మూసివేయాలని స్పష్టంచేశారు. మొబైల్, ఇంటర్నెట్‌ సదుపాయం వంటివి లేక  కొందరు విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమవుతుండడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భారత్‌లోని చిన్నారులు వైరస్‌ను ఎదుర్కోవడం వల్ల వారిలో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని గులేరియా చెప్పారు. ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్త నిర్వహించిన సర్వేలో సార్స్‌-కోవ్‌-2 సీరో పాజిటివిటీ రేటు పెద్దల కంటే పిల్లల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

పండగలతో కేసుల్లో పెరుగుదల

దేశంలో పండగల సమయంలో కాస్తంత సహనంతో ఉండాలని రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మతపరమైన కారణాలతో ఆంక్షలను సడలించరాదని స్పష్టంచేశారు. ‘‘కేరళలో కేసుల పెరుగుదలను చూస్తున్నాం. ఒక్కసారి కరోనా సోకుతున్న రేటు తగ్గగానే.. మీరు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. అలా చేయడానికి ఇది సరైన సమయం కాదు’’ అని స్పష్టంచేశారు. ఎక్కువ మంది ప్రజలు ఒకచోట గుమిగూడే 

ఏ కార్యక్రమమైనా కేసుల పెరుగుదలకు, 

ఆరోగ్య వ్యవస్థలపై భారాన్ని పెంచేందుకు దారితీస్తుందని చెప్పారు. రాష్ట్రాల మధ్య రాకపోకలు సైతం కేసుల పెరుగుదలకు దోహదపడుతుందని రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని