గొర్రె-తోడేళ్ల కథ రాజద్రోహమట.. ఆ చట్టం కింద అయిదుగురి అరెస్ట్‌

చిన్నపిల్లల పుస్తకం ముసుగులో రాజద్రోహం సమాచారం ముద్రించారంటూ హాంకాంగ్‌ పోలీసులు

Published : 23 Jul 2021 13:25 IST

 

హాంకాంగ్‌: చిన్నపిల్లల పుస్తకం ముసుగులో రాజద్రోహం సమాచారం ముద్రించారంటూ హాంకాంగ్‌ పోలీసులు గురువారం ఐదుగురు వాణిజ్య సంఘం సభ్యులను అరెస్టు చేశారు. ఈ మేరకు నలుగురు సంపాదకులు, ఓ పాత్రికేయుడిని.. జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి బెయిల్‌ నిరాకరించారు. అసమ్మతిని అణచివేసేందుకు చైనా అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్లు భావిస్తున్నారు. అరెస్టయిన ఐదుగురు హాంకాంగ్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌ల సంఘానికి చెందినవారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఘం ప్రచురించిన పుస్తకాల్లో రాజద్రోహం అంశాలు ఉన్నట్లు జాతీయ భద్రత విభాగం సీనియర్‌ సూపరింటెండెంట్‌ లీ క్వాయ్‌ వా చెప్పారు. ఈ పుస్తకంలోని కథ గొర్రెలు నివాసం ఉండే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఇతర గ్రామాల నుంచి వచ్చే తోడేళ్లతో ఎలా వ్యవహరించాలన్నది అంశం.

తోడేళ్లకు వ్యతిరేకంగా నిరసనకు దిగడం లేదా పడవలో తప్పించుకోవడం వంటి వ్యూహాలు పాటించాలని ఇందులో చర్చించారు. ఈ కథ హాంకాంగ్‌ నుంచి సముద్ర మార్గంలో తప్పించుకునే క్రమంలో అరెస్టయిన 12 మంది ఆందోళనకారులను ప్రతిబింబిస్తోందని లీ చెప్పారు. ‘క్రూరత్వంతో ఉన్న తోడేళ్లు.. గొర్రెలు నివాసం ఉండే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించడం, వాటిని చంపేందుకు యత్నించడం’ కథ కూడా ఉందని లీ వివరించారు. నాలుగు నుంచి ఏడేళ్ల చిన్నారులే లక్ష్యంగా ఈ పుస్తకాలను రూపొందించారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి మనసుల్లో విష బీజాలు నాటేందుకేనని చెప్పారు. అరెస్టయిన అయిదుగురూ ప్రజాస్వామ్య అనుకూల యాపిల్‌ దినపత్రికకు చెందినవారు. ప్రస్తుతం యాపిల్‌ దినపత్రిక మూతపడిన సంగతి తెలిసిందే. తాజా అరెస్టులతో ఇప్పటి వరకు ఈ దినపత్రికకు చెందిన ఎనిమిది మంది మాజీ ఉద్యోగులు అరెస్టయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని