Material: దానంతట అదే బాగయ్యే పదార్థం!

దానంతట అదే మరమ్మతు చేసుకునే సరికొత్త పదార్థాన్ని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు.

Published : 26 Jul 2021 02:03 IST

దిల్లీ: దానంతట అదే మరమ్మతు చేసుకునే సరికొత్త పదార్థాన్ని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. రోజూ ఉపయోగించే పరికరాలు యంత్రాల్లో లోపాల కారణంగా పనిచేయడం మానేస్తుంటాయి. దీంతో వాటిని మరమ్మతు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పరికరం మన్నిక తగ్గిపోతుంది. పైగా, ఖర్చు! అంతరిక్షంలో తిరిగే యంత్రాలు పాడైతే, వాటికి మరమ్మతులు చేయడం చాలా కష్టం. కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌), ఐఐటీ-ఖరగ్‌పూర్‌ నిపుణులు ఈ అంశంపై దృష్టి సారించారు. యంత్ర పరికరాల్లో వాడదగ్గ ‘పీజోఎలక్ట్రిక్‌ మాలెక్యులర్‌ క్రిస్టల్స్‌’ను రూపొందించారు. ‘‘ఇవి స్పటిక ఆకారంలో ఉంటాయి. వీటిలో లోపాలు తలెత్తినా, ఎలాంటి బాహ్య ప్రమేయం లేకుండా... వాటంతట అవే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి! మిల్లీ సెకెండ్లతో సహా అత్యంత కచ్చితత్వంతో ఇవి స్వస్థత పొందుతాయి. వీటిలో ఎక్కడైనా పగుళ్లు ఏర్పడితే, అక్కడ వెంటనే విద్యుత్‌ ప్రభావం మొదలవుతుంది. కొద్దిసేపటికి ఈ ఘన పదార్థంలో మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొంటుంది’’ అని పరిశోధకులు వివరించారు. అత్యంత సున్నితమైన మైక్రోచిప్‌లు, మెకానికల్‌ సెన్సర్లు, రోబోట్‌ల తయారీకి ఈ పదార్థం అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. భవిష్యత్తులో నవతరం స్మార్ట్‌ఫోన్ల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని