Corona: కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విశ్వవిజృంభణ

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్‌ ‘డెల్టా’

Updated : 31 Jul 2021 13:17 IST

జపాన్‌లో ‘వైరస్‌ ఎమర్జెన్సీ’
అమెరికాలో 92 వేలకు పైగా కేసులు
చైనాలో 15 నగరాల్లో కొవిడ్‌ వ్యాప్తి

టోక్యో/బీజింగ్‌/వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్‌ ‘డెల్టా’ రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జపాన్‌ ‘వైరస్‌ ఎమర్జెన్సీ’ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాజధాని టోక్యోలో ఇప్పటికే ‘అత్యవసర పరిస్థితి’ ఉండగా మరో 4 ప్రాంతాల్లోనూ అమలుకు శుక్రవారం నిర్ణయించింది. టోక్యో సమీపంలోని సైతమా, కనగావా, చిబాలతో పాటు ఒసాకా నగరం పశ్చిమ ప్రాంతాల్లోనూ ‘ఎమర్జెన్సీ’ విధిస్తున్నట్లు జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా ప్రకటించారు. వీటితో పాటు టోక్యో, ఒకినావా ద్వీపాల్లోనూ ఆగస్టు 31 వరకు ఎమర్జెన్సీ ఉంటుందని వెల్లడించారు. కాగా హొక్కైడ, క్యోటో, హ్యోగో, ఫుకుఓకా ప్రాంతాల్లో తక్కువ స్థాయి ఎమర్జెన్సీ నిబంధనలు అమలు చేయనున్నారు. జపాన్‌లో తొలిసారిగా గురువారం 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఎమర్జెన్సీలో భాగంగా పనివేళలను కుదించడం.. బార్లు, హోటళ్లలో మద్యపాన నిషేధం వంటివి చేపడుతున్నారు. దేశంలో స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు యాంటీబాడీ కాక్‌టైల్‌ వినియోగానికి ప్రభుత్వం అనుమతించినట్లు ప్రధాని తెలిపారు. అయితే వేల మంది ఆసుపత్రి పడకలు, చికిత్సల కోసం ఎదురు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇవ్వడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని.. ఈ క్రీడలకు కొవిడ్‌ వ్యాప్తికి సంబంధం లేదని చెప్పారు. కాగా గురువారం నాటికి 27% మంది జపనీయులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందారు.

టోక్యోలో రెండు వారాలుగా.. టోక్యోలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పటికీ రెండు వారాలుగా కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు 24 నుంచి ఈ నగరంలో పారాలింపిక్స్‌ కూడా ప్రారంభం కానున్నాయి. గత 3 రోజులుగా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా టోక్యోతో పాటు పశ్చిమ మెట్రోపాలిటన్‌ పారంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుత్నుట్లు సుగా తెలిపారు. కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. ఇదేతీరులో పరిస్థితి కొనసాగితే జపాన్‌లోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ప్రధాని చెప్పడం తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యోలో 6 వేల ఆసుపత్రి పడకల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 2,995 మంది ఆసుపత్రి పాలయ్యారు. మరో 10 వేల మంది ఇళ్లు, హోటళ్లలో ఐసొలేషన్‌లో ఉంటున్నారు. 

అగ్రరాజ్యంలో ఉద్ధృతి

అమెరికాలో గత కొద్ది రోజులుగా మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజులో 92 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు రోజు 84 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు.

చైనాలోనూ డెల్టా

చైనాలో రాజధాని బీజింగ్‌తో పాటు మరో 14 నగరాల్లో ఒక్కసారిగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్‌ డెల్టా రకం వేగంగా విజృంభిస్తోంది. 2019 డిసెంబరులో వుహాన్‌లో తొలిసారి కరోనా విజృంభించిన తర్వాత ఇదే అత్యంత తీవ్ర పరిస్థితిగా అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. చైనా జియాంగ్సు ప్రావిన్స్‌ పరిధిలోని నన్‌జింగ్‌ విమానాశ్రయంలో తొలుత కొవిడ్‌ వ్యాప్తి బయటపడింది. ఇక్కడ అధిక సంఖ్యలో సిబ్బందికి ‘పాజిటివ్‌’గా తేలడంతో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం బీజింగ్‌ మున్సిపాలిటీతో పాటు 5 ఇతర ప్రావిన్సులకు మహమ్మారి వ్యాప్తి చెందినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. బీజింగ్‌లో ఆఖరి కేసు నమోదై 175 రోజులు కావస్తుండగా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నన్‌జింగ్‌ నగరంలో దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. కాగా చైనా జనాభాలో ఇంతవరకు 40 శాతం మందికి టీకాలు వేసినట్లు అధికారిక మీడియా తెలిపింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు