Covid Vaccine: మిశ్రమ డోసు సురక్షితమే..

ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌-వి కొవిడ్‌ టీకాల మిశ్రమ డోసు వల్ల ఎలాంటి తీవ్ర దుష్పభ్రావాలు

Updated : 31 Jul 2021 13:20 IST

మాస్కో: ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌-వి కొవిడ్‌ టీకాల మిశ్రమ డోసు వల్ల ఎలాంటి తీవ్ర దుష్పభ్రావాలు కనిపించలేదంటూ తాజాగా ఓ అధ్యయనం మధ్యంతర ఫలితాలను వెల్లడించింది. టీకా పొందిన వారిలో ఇన్‌ఫెక్షన్‌ రావడం వంటి పరిణామాలు కూడా లేవని పేర్కొంది. అంతేకాకుండా ఈ మిశ్రమ డోసు వల్ల కరోనా వైరస్‌పై రోగ నిరోధక శక్తి మరింత కాలం పనిచేసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈమేరకు అజర్‌బైజాన్‌లో  పరిశోధకులు 50 మందిపై ప్రయోగాలు చేపట్టారు. 2021 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ అధ్యయనంలో.. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌-వి మిశ్రమ డోసు ఎంతమేర సురక్షితం? దీనివల్ల రోగనిరోధక శక్తి ఎలా ఉంటుందన్న విషయాన్ని పరిశీలించారు. ఈమేరకు అధ్యయన సమాచారాన్ని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌), ఇతర భాగస్వాములు ఆగస్టులో ప్రచురించనున్నారు. ‘‘కరోనా వైరస్‌ కొత్త రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వేర్వేరు టీకా తయారీదారుల మధ్య భాగస్వామ్యాలు అవసరం. వేర్వేరు టీకాలను మిశ్రమ డోసులుగా ఇవ్వడం కూడా మహమ్మారిపై పోరులో కీలకం’’ అని ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్‌ ద్మిత్రైవ్‌ తెలిపారు. కాగా ఇప్పటికే మిశ్రమ టీకా డోసులపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని