Rocket attack: కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్ల దాడి

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్ల దాడి జరిగింది.

Updated : 01 Aug 2021 13:55 IST

కాందహార్‌: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి రాకెట్ల దాడి జరిగింది. ఈ విషయాన్ని విమానాశ్రయ చీఫ్‌ మసూద్‌ పష్తూన్‌ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్‌వేను తాకాయని తెలిపారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నారు. రన్‌వేను బాగుచేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నానికి విమాన సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు.

అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్‌లోని మెజారిటీ ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం భూభాగం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది తాలిబన్‌ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించారు. తాలిబన్లపై దాడికి కాందహార్‌ విమానాశ్రయం కీలకంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన లాజిస్టిక్‌, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. దక్షిణ ప్రాంతంలోని మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్‌, లష్కర్‌ ఘాను సైతం సొంతం చేసుకునేందుకు తాలిబన్లు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని