Wuhan : వుహాన్‌లో మళ్లీ కరోనా.. కోటి మందికి కొవిడ్‌ పరీక్షలు..

చైనాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా మహమ్మారి తొలిసారి బయట పడిన వుహాన్‌ నగరంలో మంగళవారం భారీఎత్తున కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు...

Updated : 04 Aug 2021 12:23 IST

బీజింగ్‌: చైనాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా మహమ్మారి తొలిసారి బయట పడిన వుహాన్‌ నగరంలో మంగళవారం భారీఎత్తున కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. మొత్తం నగర జనాభా 1.1 కోట్ల మందికి పరీక్షలు చేయడానికి నిర్ణయించారు. గత ఏడాది జూన్‌ నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాని వుహాన్‌లో తాజాగా కేసులు బయటపడ్డాయి. కొత్తగా 90 కేసులను గుర్తించినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. వీటిలో 61 కేసులు స్థానికంగా నమోదు కాగా, 29 విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తించినట్లు తెలిపింది. ఈమేరకు కేసులు బయటపడిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. నగరంలో అన్ని పాఠశాలలను మూసివేశారు.

‘డెల్టా’ వ్యాప్తి..
చైనాలో ప్రధానంగా కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈమేరకు వుహాన్‌తో పాటు బీజింగ్‌ నగరంలోను.. పలు ఇతర ప్రావిన్సుల్లోనూ లక్షల సంఖ్యలో ప్రజలకు పరీక్షలు జరుపుతున్నారు. బీజింగ్, షాంఘై, ఫుజియాన్‌ నగరాలతో పాటు జియాంగ్సు, హ్యునన్, హ్యుబేయి, హెనన్, యున్నన్‌ తదితర ప్రావిన్సుల్లో స్థానికంగా వైరస్‌ వ్యాప్తి ద్వారా కొత్త కేసులు బయట పడినట్లు ఎన్‌హెచ్‌సీ మంగళవారం తెలిపింది. వీరే కాకుండా ఇతర దేశాలకు వెళ్లొచ్చిన చైనీయులు కూడా వైరస్‌ బారిన పడినట్లు పేర్కొంది. కరోనా తాజా వ్యాప్తికి మూలకేంద్రంగా భావిస్తున్న ఝాంగ్‌జియాజీ నగరం నుంచి ప్రజలెవరూ బయటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలిచ్చారు.

చైనా టీకాల ప్రభావమెంత?
కొత్తగా బయటపడుతున్న కేసులు.. చైనా టీకాలపై ఆందోళన పెంచుతున్నాయి. ప్రధానంగా డెల్టా రకంపై ఈ వ్యాక్సిన్లు ఎంతమేర పనిచేస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రకంపై కూడా చైనా టీకాలు సమర్థంగా పనిచేస్తాయని దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఝోంగ్‌ నన్షన్‌ అంచనా వేశారు. మే నెలలో గౌంగ్‌ఝౌ నగరంలో 100 మంది కొవిడ్‌ బాధితులపై జరిపిన అధ్యయనంలో ఇది తేలినట్లు పేర్కొన్నారు. చైనాలో సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) రావాలంటే దాదాపు 140 కోట్ల జనాభాలో 83.3 శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరగాలని ఝోంగ్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు వుహాన్‌లో ప్రజలు రెండో ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి.

ఫ్లోరిడా ఆసుపత్రులు కిటకిట..
ఫ్లోరిడా: కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం విలవిలలాడుతోంది. ఇక్కడ ఒక్క రోజులో ఏకంగా 11,515 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 2,400 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో చేరడం ఇదే తొలిసారని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం మంగళవారం తెలిపింది. క్రితం రోజు కూడా 10,389 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వైద్య సిబ్బంది కొరత తీవ్రమైంది. ఆసుపత్రుల్లో వసతులు కూడా సరిపోకపోవడంతో సందర్శకుల గదులు, హాళ్లలో కూడా అత్యవసరంగా పడకలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. ఇంతవరకు ఫ్లోరిడాలో గత ఏడాది జులై 23న అత్యధికంగా 10,170 మంది ఆసుపత్రుల పాలయ్యారు.


ఆ ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌!

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే లీకయినట్లు అమెరికాలోని రిపబ్లికన్లు ఆరోపించారు. మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించేలా.. ల్యాబ్‌లోనే ఈ వైరస్‌కు జన్యుపరమైన మార్పులు చేశారని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ మేరకు రిపబ్లికన్‌ ప్రతినిధి మైఖేల్‌ మెక్‌కౌల్‌ (విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు) ఓ నివేదికను విడుదల చేశారు. ఇది ‘కరోనా వైరస్‌ మూలాలు, మహమ్మారిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా తప్పటడుగులు’ అనే అంశంపై తన పరిశోధనకు సంబంధించి ఆయన రూపొందించిన మూడో విడత నివేదికగా ఓ వార్తాసంస్థ తెలిపింది. ఆరోపణలకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని.. వుహాన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు, చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారులపై ఆంక్షలు విధిస్తూ చట్టం చేయాలని మైఖేల్‌ మెక్‌కౌల్‌ కాంగ్రెస్‌ను కోరారు. వుహాన్‌ ల్యాబ్‌ వద్ద పటిష్ఠమైన భద్రత చర్యలు లేవని.. ప్రమాదకర వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ్యవస్థ కూడా సరిగా లేదని పేర్కొన్నారు. వైరస్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌ ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే ఓ వాదనను కూడా ఈ నివేదిక ఖండించింది. మరోవైపు ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వంతో పాటు వుహాన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. వుహాన్‌లోని మార్కెట్‌లోనే జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకి ఉండొచ్చని చెబుతున్నారు. కాగా కరోనా వైరస్‌ మూలాలపై దర్యాప్తు ముమ్మరం చేసి 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అమెరికా నిఘా సంస్థలకు అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిందా? లేదా వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకైందా అనే విషయమై అమెరికా నిఘా సంస్థలు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ల నివేదిక ఆసక్తి రేపుతోంది.


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts