Updated : 04 Aug 2021 12:22 IST

pegasus: పెగాసస్‌పై సిట్‌ దర్యాప్తునకు ఆదేశించాలి

సుప్రీంకోర్టులో ఎడిటర్స్‌ గిల్డ్‌ వ్యాజ్యం

దిల్లీ: పెగాసస్‌ విషయంపై ‘ది ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను దుర్వినియోగం చేసిందన్న అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలంటూ వ్యాజ్యం దాఖలు చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి దేశంలోని రాజకీయ నాయకులు, న్యాయవాదులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగిన క్రమంలో- జర్నలిస్టు మృణాల్‌ పాండే సహ పిటిషనర్‌గా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది.

‘‘ప్రజలకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని తీసుకోవడం, దాన్ని విశ్లేషించడం; ప్రభుత్వ చర్య లేదా నిష్క్రియ రాజ్యాంగబద్ధంగా ఉందా? లేదా? అన్నది చెప్పడం జర్నలిస్టుల వృత్తి ధర్మం. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే... పత్రికాస్వేచ్ఛకు భద్రత కల్పించాలి. ప్రభుత్వం, దాని ఏజెన్సీలు జర్నలిస్టుల విధుల్లో జోక్యం చేసుకోనంత వరకే ఆ స్వేచ్ఛ ఉంటుంది. జర్నలిస్టులు విపక్ష నేతలతో మాట్లాడేటప్పుడు; ప్రభుత్వ అసమర్థత, అవినీతి, అధికారాల దుర్వినియోగాన్ని వెలికి తీసేటప్పుడు... సమాచారాన్ని సేకరించి, రిపోర్టు చేసేటప్పుడు ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. అలాంటప్పుడే వారు అత్యంత భద్రంగా, ఆత్మవిశ్వాసంతో సమాచారాన్ని సేకరించగలుగుతారు. రాజ్యాంగ పరిధిని అతిక్రమించడం ద్వారా, ప్రజల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగం కలిగించిందా అన్న విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా దీన్ని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పెగాసస్‌తో నిఘాపెట్టిన అంశంపై అక్కడ చర్చ జరగనివ్వలేదు. పైగా ప్రతివాదులు అసంబద్ధ సమాధానాలు చెప్పారు. అందుకే ఈ విషయమై కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దేశ ప్రజలపై, ముఖ్యంగా జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా ఉంచిన విషయంపై విచారణకు న్యాయస్థాన పర్యవేక్షణలో సిట్‌ను నియమించాలి. ఎలక్ట్రానిక్‌ విధానంలో నిఘా ఉంచడం, ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడటం, స్పైవేర్‌ను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధం’’ అని గిల్డ్‌ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 5న దీనిపై విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై సీనియర్‌ పాత్రికేయులు ఎన్‌.రామ్, శశికుమార్‌లు వేసిన వ్యాజ్యం సహా మూడు వేర్వేరు పిటిషన్లపై విచారణ జరుగనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts