wildfire: ప్రపంచాన్ని వణికిస్తున్న కార్చిచ్చు..

ప్రపంచంలోని పలు దేశాల్లో  కార్చిచ్చులు బెంబేలెత్తిస్తున్నాయి.

Updated : 07 Aug 2021 15:49 IST

 కాలిఫోర్నియాలోని గ్రీన్‌విల్లేలో ఓ కాలనీ మొత్తం భస్మం

గ్రీన్‌విల్లే, ఏథెన్స్, ఇస్తాంబుల్‌: ప్రపంచంలోని పలు దేశాల్లో  కార్చిచ్చులు బెంబేలెత్తిస్తున్నాయి. అడవులను దహించివేయడంతో పాటు జనావాసాలకూ వ్యాపిస్తూ ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు కారణమవుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, ఐరోపాలోని గ్రీస్, దాని సరిహద్దు దేశమైన టర్కీల్లో కొంతకాలంగా విజృంభిస్తున్న కార్చిచ్చు వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. ఉత్తర కాలిఫోర్నియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న కార్చిచ్చు గురువారం గ్రీన్‌విల్లే ప్రాంతాన్ని చుట్టుముట్టింది. బలమైన ఈదురుగాలులతో అంతకంతకూ ఉద్ధృతమవుతూ చారిత్రక ప్రాంతమైన ఉత్తర సియెర్రా నెవడా కమ్యూనిటీలో 100కు పైగా నివాసాలను బూడిద చేసింది. పెట్రోల్‌ బంకు, చర్చి, హోటల్, మ్యూజియం, బార్, పాఠశాలలు కూడా కాలిపోయాయి. ఇక్కడ చెక్కతో నిర్మించిన కొన్ని భవనాలు వందేళ్ల నాటివి కావడం గమనార్హం. గ్రీన్‌విల్లేను మేం కోల్పోయాం అంటూ అమెరికా చట్టసభ ప్రతినిధి డౌగ్‌ లామల్ఫా ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా చరిత్రలో ఇది మూడో అతి పెద్ద కార్చిచ్చు అని అధికారులు తెలిపారు.

30 ఏళ్లలో అత్యంత తీవ్రమైన కార్చిచ్చు

గ్రీస్‌లో పది రోజలుగా కొనసాగుతున్న కార్చిచ్చు ఉద్ధృతి తగ్గలేదు. ఉత్తర ఏథెన్స్‌లో అటవీ ప్రాంతాల సమీప గ్రామాలకు గురువారం రాత్రి మంటలు వ్యాపించాయి. వేల మంది ప్రజలు నివాసాలు వదిలి వెళ్లిపోయారు. మంటలను నిలువరించేందుకు అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవియా దీవిలోని స్థానికులతో పాటు అక్కడికి వచ్చిన పర్యాటకులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్‌ నుంచి ఉత్తర గ్రీస్‌ను కలిపే దేశ ప్రధాన జాతీయ రహదారిని మూసేశారు. బలమైన గాలులతో వాతావరణ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న అంచనాల నేపథ్యంలో దక్షిణ గ్రీస్‌లో దాదాపు 60 గ్రామాలను ఖాళీ చేయించారు. గ్రీస్‌లో గత 30 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన, సుదీర్ఘమైన కార్చిచ్చు రేగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

టర్కీలో విధ్వంసం

మరోవైపు టర్కీలో అధిక వేడిమి వల్ల దక్షిణ, నైరుతి తీర ప్రాంతాల్లోని అడవుల్లో భారీ స్థాయిలో మంటలు రేగాయి. టర్కీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్న కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకూ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మర్మరిస్, బోడ్రమ్, అంటల్య ప్రావిన్సుల్లో ఎకరాల కొద్ది అటవీ ప్రాంతం దగ్ధం కావడంతో ఎన్నో జంతువులు దహనమయ్యాయి. వేల మంది నివాసాలు కోల్పోయారు. పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని