ఇంకా ముప్పు ముంగిటే!

కరోనా సెకండ్‌వేవ్‌ సృష్టించిన బీభత్సాన్ని జనం అప్పుడే మర్చిపోయారనిపిస్తోంది..!

Published : 10 Aug 2021 16:04 IST

 కరోనా గండం పొంచే ఉంది.. జాగ్రత్తలు విస్మరిస్తున్న జనం

ఈనాడు, అమరావతి: కరోనా సెకండ్‌వేవ్‌ సృష్టించిన బీభత్సాన్ని జనం అప్పుడే మర్చిపోయారనిపిస్తోంది..! కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో...ఎక్కడ తిరిగినా, ఎలా తిరిగినా ఫరవాలేదనుకుంటున్నారు కొందరు. భౌతికదూరం పాటించడం, మాస్కు పెట్టుకోవడం ద్వారా కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చన్న ప్రాథమిక సూత్రాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మొదలు రోడ్డు పక్కన తినుబండారాలమ్మే బళ్ల దగ్గరా, టీ షాపుల దగ్గరా గుంపులుగా చేరుతున్నారు. మద్యం దుకాణాల దగ్గర చెప్పాల్సిన పనేలేదు. ఆదివారం వస్తే చేపల మార్కెట్‌లు, మాంసం దుకాణాల దగ్గర బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయిందనుకుంటే పొరపాటే! ఇప్పటికీ పాజిటివిటీ రేటు 2.5-3 శాతం మధ్య నమోదవుతోంది. కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందని, కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. డెల్టా, డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులూ భయపెడుతున్నాయి. ప్రజలు ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని...కొవిడ్‌ మనల్ని వదిలి పోలేదన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, లేకపోతే మహమ్మారి మళ్లీ ఏ క్షణంలోనైనా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్త తప్పదు!

వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో కొందరు తమకు కరోనా సోకదన్న ధీమాతో జాగ్రత్తలు పాటించడం లేదు. అలాంటి వాళ్లు 10-15 శాతం ఉంటారని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకకుండా వ్యాక్సిన్‌ అడ్డుకోదని, వైరస్‌ సోకినా వ్యాధి తీవ్రంగా మారకుండా రక్షణ కల్పిస్తుందని వారంటున్నారు. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నవారిలోనూ కొందరు కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో వైరస్‌బారినపడి ఆసుపత్రిలో చేరిన ఉదంతాలు ఉన్నాయి. పైగా రాష్ట్రంలో ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవలసినవారు చాలా మంది ఉన్నారు.

మరిస్తే ముప్పే!

 మంచి మాస్కు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, అవసరం లేకుండా ప్రయాణాలు చేయకపోవడం, విందులు, వినోదాలకు వెళ్లకపోవడం... మొదటి నుంచీ చెబుతున్న జాగ్రత్తలివే. ఇప్పటికీ అవే మౌలిక సూత్రాలు. 

మనతో పాటు మన పక్కవాళ్లు కూడా మాస్కుపెట్టుకుంటే 95 శాతం వరకు రక్షణ లభిస్తుంది.

వైద్య పరీక్షలు, చికిత్సల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు రెండు మాస్కులు ధరించాలి.

​​​​​​ కొందరు మాస్కుని నోటికి మాత్రమే పెట్టుకుని, ముక్కుని వదిలేస్తున్నారు. అలా చేస్తే ముప్పు పొంచే ఉంటుంది.

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఒకేసారి ఎక్కువ మంది గుమికూడటమూ కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశముంది.

థర్డ్‌వేవ్‌ని మనమే ఆహ్వానించేలా ఉన్నాం

‘‘కరోనా థర్డ్‌వేవ్‌ కచ్చితంగా రావాలనేమీ లేదు. అది వచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని మనమే సృష్టిస్తున్నాం. కరోనా ఇప్పటికే రావాల్సిన వాళ్లకు వచ్చేసింది, ఇక మనకు రాదులే అన్న భావనలో కొందరు ఉన్నారు. కొవిడ్‌ అంత ప్రమాదకరమేమీకాదన్న మొండి ధైర్యం కొందరిలో పెరిగింది. ముఖ్యంగా యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్ల ఇంట్లో పెద్దలకూ ముప్పు పొంచి ఉంది’’ - డాక్టర్‌ రామనరసింహం, సీనియర్‌ ఫిజీషియన్‌

మన వరకు రాదనుకునే మనస్తత్వంతో ప్రమాదం

‘‘ఉష్ట్రపక్షి ఏదైనా ప్రమాదాన్ని శంకించినప్పుడు ఇసుకలో తల దాచుకుని తనకేమీ కాదనుకుంటుందని చెబుతారు. కొందరు మనుషుల్లోను ఇలాంటి ‘డినైయింగ్‌’, ‘ఎస్కేపింగ్‌’ ధోరణి ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా విపత్తు వస్తుందేమోగానీ, తమ వరకు రాదన్న భావన వారిలో ఉంటుంది. ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్‌ పొంచి ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నా కూడా... కొందరు జాగ్రత్తలు పాటించకపోవడానికి ఆ టెండెన్సీనే కారణం. పైగా తాము చేసే పనిని వారు సమర్థించుకుంటారు. మనుషుల్లో ఇంటిలెక్చువల్‌ ఇన్‌సైట్, ఎమోషనల్‌ ఇన్‌సైట్‌ అని రెండు రకాలు ఉంటాయి. అవి రెండూ సమతూకంలో ఉంటేనే... ప్రవర్తన సరిగా ఉంటుంది. మాస్కు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని మెదడు చెప్పినా... దాన్ని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన భావోద్వేగపూరిత దృష్టి లేకపోతే అమలు చేయరు’’  - కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని