Covid Test at Home: చౌకలో ఇంటివద్దే కొవిడ్‌ పరీక్ష

సొంతంగా ఇంటి వద్దే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలు కల్పించే ఒక విధానాన్ని అమెరికా

Published : 10 Aug 2021 15:05 IST

 సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు 

బోస్టన్‌: సొంతంగా ఇంటి వద్దే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలు కల్పించే ఒక విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది లాలాజలాన్ని విశ్లేషిస్తుందని, చాలా చౌకైందని వారు చెప్పారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ సాధనం పేరు ‘మినిమల్లీ ఇన్‌స్ట్రూమెంటెడ్‌ షెర్లాక్‌’ (మి షెర్లాక్‌). దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. గంటలోగా మన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌పై ఫలితాన్ని పొందొచ్చు. ఇది కరోనాలోని మూడు భిన్న వేరియంట్లను విజయవంతంగా గుర్తించగలిగింది. డెల్టా వంటి అదనపు రకాలను గుర్తించేలా సాధనంలో సర్దుబాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. త్రీడీ ప్రింటర్, సాధారణంగా అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో ఈ యంత్రాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘‘రోగి నమూనాలను కేంద్రీకృత పరీక్ష ప్రదేశానికి తరలించాల్సిన అవసరాన్ని మి షెర్లాక్‌ తప్పిస్తుంది.

దీనివల్ల ఒక ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య స్థితి గురించి వైద్యులకు చాలా త్వరగా, మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. మహమ్మారి విజృంభణ సమయంలో ఇది చాలా కీలకం’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న హెలీనా డి పగ్‌ చెప్పారు. జన్యువుల్లో మార్పులు చేయడానికి ఉపయోగించే క్రిస్పర్‌ పరిజ్ఞానంతో ‘మి షెర్లాక్‌’ను తయారుచేశారు. ఇది క్రిస్పర్‌లోని కాస్‌12ఎ అనే పరమాణు కత్తెరను ఉపయోగించుకొని, కరోనా వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏలో ఉన్న న్యూక్లియోప్రొటీన్‌ ప్రాంతాన్ని కత్తిరిస్తుంది. ఈ క్రమంలో ఒక ఫ్లోరసెంట్‌ సంకేతం వెలువడుతుంది. దీని ఆధారంగా కరోనా ఉనికిని గుర్తించొచ్చు. వైరస్‌లోని ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను ఈ సాధనం సులువుగా పసిగడుతుంది. ప్రస్తుతం రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఇది బాధితుడికి నొప్పి కలుగుతోంది. ‘మి షెర్లాక్‌’ విధానంలో లాలాజల నమూనాలను పరీక్షిస్తున్నందువల్ల ఈ ఇబ్బంది దూరమవుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని