Corona: వణుకుతున్న ఫ్లోరిడా..  చైనాలో ఆందోళనకరంగా వైరస్‌

ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులో 5.27 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 8 వేల మందికి పైగా మృతి చెందారు. ..

Published : 11 Aug 2021 15:09 IST

అమెరికాలో లక్షకు పైగా కొత్త కేసులు

బీజింగ్‌/వాషింగ్టన్‌: ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులో 5.27 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 8 వేల మందికి పైగా మృతి చెందారు. అమెరికాలో మరోసారి రోజువారీ కేసుల సంఖ్య సోమవారం లక్ష దాటింది. చైనాలో తాజా ఉద్ధృతిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. చాలాచోట్ల ప్రధానంగా కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది.

13 ప్రావిన్సుల్లో డెల్టా..
చైనాలో 23 ప్రావిన్సులకు గాను 13 చోట్ల డెల్టా రకం బయటపడింది. మంగళవారం 180 కొత్త కేసులు బయటపడ్డాయి. వుహాన్‌ నగరం ఉన్న హుబేయ్‌ ప్రావిన్సులోనే 68 కేసులు బయటపడ్డాయి. జియాంగ్‌సు ప్రావిన్సులో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నట్లు చైనా అధికారికి మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. కాగా కొవిడ్‌ కట్టడికి చైనా గత కొద్ది రోజులుగా చర్యలను ముమ్మరం చేసింది. అనేక ప్రాంతాల్లో విరివిగా పరీక్షలు జరుపుతోంది.

వణుకుతున్న ఫ్లోరిడా..
ఫ్లోరిడాలో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిట లాడుతుండగా.. అంబులెన్సులు బారులు తీరుతున్నాయి. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రోగులు అంబులెన్సులోనే గంట పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఫ్లోరిడాలో సోమవారం 13,600 కేసులు నమోదయ్యాయి. టెక్సాస్‌లోనూ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. హ్యూస్టన్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఆరు బయట శిబిరాలు వేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

ఇరాన్‌లో ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వైరస్‌ పంజా విసురుతోంది. సోమవారం 40 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. 588 మంది మృతి చెందారు.
బ్రిటన్‌లోనూ డెల్టా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్క రోజులో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించడంతో టర్కీలోనూ వైరస్‌ తిరిగి విజృంభిస్తోంది. సోమవారం కొత్తగా 23 వేల కేసులు నమోదయ్యాయి.
ఇండొనేసియాలో కేసులు కొంతమేర అదుపులోకి వస్తున్నా.. మరణాలు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. ఒక్క రోజులో 1,475 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని