Parliament: నిరసనల హోరువానలో నీరుగారిన పార్లమెంటు సమావేశాలు!

వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్ష సభ్యుల నిరసనల హోరులో కొట్టుకుపోయాయి.

Updated : 12 Aug 2021 09:26 IST

 28 గంటలే పనిచేసిన ఎగువసభ.. దిగువ సభలోనూ అదే తంతు
పట్టువిడుపుల్లేని అధికార, విపక్షాలు 
పైచేయి కోసం అంతటా తాపత్రయం

ఈనాడు, దిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్ష సభ్యుల నిరసనల హోరులో కొట్టుకుపోయాయి. పెగాసస్, సాగుచట్టాల రద్దు తదతర అంశాలు పార్లమెంటు సమావేశాలను కారుమేఘాల్లా కమ్మేయడంతో సభలు కొనసాగడం గగనమైంది. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓబీసీలకు సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లును అన్ని పార్టీలూ కలిసికట్టుగా ఆమోదించడం మినహా... మరే బిల్లుపైనా పట్టుమని పది నిమిషాలైనా చర్చించలేదు! రాజ్యసభ కొనసాగిన 28 గంటల్లో 19 బిల్లులు, లోక్‌సభ కొనసాగిన 21 గంటల్లో 20 బిల్లులు ఆమోదం పొందాయి. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలూ పార్లమెంటు సమావేశాలనే వేదికగా మలుచుకోవడంతో ప్రజాస్వామ్య దేవాలయం వెలవెలబోయింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లకు తగిన సమయం దక్కలేదు. అధికార, విపక్షాలు పట్టు విడుపుల్లేకుండా తమదే పైచేయి అనిపించుకోవాలని తాపత్రయపడటంతో పార్లమెంటు పనితీరు పలుచనైంది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలకు కేవలం 14% సమయమే దక్కింది. జీరో అవర్‌ ఒక్క శాతానికే పరిమితమైంది. ఎగువసభలో బిల్లులపై చర్చకు దొరికిన సమయం కేవలం 45% మాత్రమే!

స్థాయీ సంఘాల సమావేశాలదీ అదే దారి..

ఈసారి స్థాయీ సంఘాల సమావేశాలనూ రాజకీయాలు కమ్మేశాయి. పెగాసస్‌ వ్యవహారంపై అధ్యయనం చేపట్టేందుకు కాంగ్రెస్‌ సభ్యుడు శశిథరూర్‌ నేతృత్వంలోని స్థాయీ సంఘం ప్రయత్నించగా, అధికారపక్ష సభ్యులు గైర్హాజరయ్యారు. ఇతర పార్టీల సభ్యులు హాజరుకాకుండా వారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికార సభ్యులు కోరం లేకుండాచేసి పెగాసస్‌పై అధ్యయనం చేపట్టకుండా అడ్డుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్లమెంటు లోపల, బయట అధికార, విపక్ష సభ్యులు ఎవరి బలాన్ని వారు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని