RSS: చైనాపై ఆధారపడటం తగ్గాలి.. లేకుంటే ఆ దేశానికి తలవంచాల్సి వస్తుంది

చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌

Updated : 16 Aug 2021 10:46 IST

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ 

ముంబయి: చైనాపై ఆధారపడటం పెరిగితే.. ఆ దేశం ముందు మనం తలవంచాల్సి వస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భాగవత్‌ ఆదివారం పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ముంబయిలోని ఓ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, ప్రసంగించారు. ‘‘మనం ఇంటర్నెట్, టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నాం. అయితే దేశానికి సొంత సాంకేతికత లేదు. అది వెలుపలి నుంచి వస్తోంది. చైనా గురించి మనం ఎన్ని విమర్శలు చేసినా, ఆ దేశ ఉత్పత్తులను ఎంతగా నిషేధించినా.. మన మొబైల్‌ ఫోన్‌లోని విడిభాగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా చైనా మీద మనం ఆధారపడటం తగ్గాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక భద్రత చాలా ముఖ్యమని భాగవత్‌ తెలిపారు. మన అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను మలచుకోవాలన్నారు. మనకు ‘స్వనిర్భర్‌’ ఉండాలని సూచించారు. ‘‘స్వదేశీ అంటే మిగతా అన్నింటినీ విస్మరించడం కాదు. అంతర్జాతీయ వాణిజ్యానికి మేం వ్యతిరేకం కాదు. అది కొనసాగాలి. అయితే మన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇందుకోసం మనం స్వయం సమృద్ధి సాధించాలి.

మనం ఇంట్లోనే తయారుచేసుకునే వస్తువులను మార్కెట్‌ నుంచి తెచ్చుకోకూడదు కదా’’ అని పేర్కొన్నారు. పోటీతత్వాన్ని పెంచి, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసేలా ఆర్థిక దార్శనికత ఉండాలన్నారు. మన ఉత్పాదన గ్రామాల్లోనే సాగాలని పేర్కొన్నారు. జనాలే వాటిని తయారుచేయాలి. ఇలాంటి వికేంద్రీకరణ వల్ల ఉపాధి మెరుగుపడుతుంది. ఎక్కువ మంది ఉత్పత్తిదారులు ఉండటం వల్ల ఎక్కువ మంది స్వయం సమృద్ధి సాధించగలుగుతారు. ఇలా సమకూరే ఆదాయాన్ని సమానంగా పంచాలి. దేశాభివృద్ధికి కీలకమైన వస్తువులను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం పరిశ్రమలకు పిలుపునివ్వాలి. వాటిని ప్రోత్సహించేలా విధానాలను రూపొందించాలి. ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థలా ఉండాలి. వ్యాపారం చేయకూడదు. సహజవనరుల దోపిడీని నిలువరించేలా వస్తు వినియోగంపై నియంత్రణ ఉండాలి’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని