అఫ్గాన్‌కు సాగునీటి ప్రాజెక్టు కట్టిచ్చాం: కేంద్ర జల సంఘం డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌

అనేక ఇబ్బందులు ఎదుర్కొని అఫ్గానిస్థాన్‌లో భారత్‌ సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ఇచ్చిందని కేంద్రజల సంఘం డైరెక్టర్‌ ఎం.రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.1,775 కోట్లతో మన దేశం సల్మా ప్రాజెక్టును కట్టిందని వివరించారు...

Updated : 18 Aug 2021 12:01 IST

భారత్‌ రూ.1,775 కోట్ల వ్యయం చేసింది
భయంభయంగా పనుల పర్యవేక్షణ  
ఆ దేశంలో తన అనుభవాలు ‘ఈనాడు’కు వివరించిన కేంద్ర జల సంఘం డైరెక్టర్‌ 

 ఎంఎల్‌ నరసింహారెడ్డి, ఈనాడు- హైదరాబాద్‌

భద్రతా బలగాల నిఘా మధ్య హెరత్‌ నుంచి సల్మా ప్రాజెక్టుకు వెళ్తున్న రమేశ్‌కుమార్‌

అనేక ఇబ్బందులు ఎదుర్కొని అఫ్గానిస్థాన్‌లో భారత్‌ సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ఇచ్చిందని కేంద్రజల సంఘం డైరెక్టర్‌ ఎం.రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.1,775 కోట్లతో మన దేశం సల్మా ప్రాజెక్టును కట్టిందని వివరించారు. అక్కడ విద్యుదుత్పత్తి మన పుణ్యమే అన్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వెళ్లేవారిమని, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉండేదని అయన పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌లో ఉన్నత విద్య చాలా తక్కువ అని.. ప్రాజెక్టు నిర్వహణ కోసం అక్కడి వారు 20 మందిని ఎంపిక చేసి రూర్కీలో ఇంజినీరింగ్‌ చదివించి శిక్షణ ఇచ్చామన్నారు. ఆ ప్రభుత్వ విన్నపం మేరకు మరో ప్రాజెక్టు నిర్మాణానికి భారత్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసిందన్నారు. మొదటి ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో భాగంగా, రెండో ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ సందర్భంగా పలుసార్లు అక్కడ పర్యటించిన రమేశ్‌కుమార్‌... అఫ్గాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ‘ఈనాడు’తో తన అనుభవాలను పంచుకున్నారు.

మహిళలు పనిచేసేవాళ్లు కాదా?
నిర్మాణంలో మహిళా కార్మికులు జీరో. ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నప్పుడు మార్గంలో దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అక్కడక్కడ గాడిదలపై వెళ్తూ కనిపించేవాళ్లు. మహిళలు, పిల్లలు గాడిదలపై కూర్చుంటే, మగవాళ్లు వాటి వెనక నడుస్తూ ఉండేవాళ్లు. అక్కడ ఎందుకూ పనికిరాని భూములెక్కువ. ఎటు చూసినా ఏమీ కనిపించదు. దానిమ్మ, ఖర్జూర తోటలతో పాటు మొక్కజొన్న అక్కడక్కడా కనిపించేవి. ఎక్కువ మంది రొట్టెలు కొనుక్కొని ఇంట్లో కూర వండుకుని తింటారు. రొట్టెలు చాలా గట్టిగా ఉంటాయి. కొంతసేపు కూరలో నానబెట్టి మెత్తగా అయిన తర్వాత తినేవాళ్లు. మనదగ్గర షాపుల్లో డాలర్లు ఇస్తే తీసుకోరు. కానీ అక్కడ స్థానిక కరెన్సీ కంటే డాలర్లు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. దీనికి మారకం విలువ ఎక్కువని. అక్కడ షాపుల్లో గన్‌లు, బుల్లెట్లు బహిరంగంగానే అమ్ముతుంటారు.

సాంకేతిక నిపుణులంతా ఇండియా నుంచే అంటే అక్కడ అసలు లేరా?
ఉన్నత విద్య చాలా తక్కువ. దీనివల్ల నిర్మాణ సమయంలోనే కాదు, పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా సాంకేతిక నిపుణుల సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదివేందుకు సౌకర్యాలు చాలా తక్కువ.. పారిపోయి పక్కదేశాలకు వెళ్లి కొంత చదువుకొని పరిస్థితి సద్దుమణిగాక తిరిగి వచ్చిన వాళ్లలో కొంత మెరుగ్గా ఉన్న 20 మందిని ఎంచుకొని కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌ రూర్కీలో 2010లో చేర్పించారు. 2014లో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వీరి ఇంజినీరింగ్‌ అయ్యేలా చూశారు. ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత విద్యుత్తు ప్రాజెక్టుల్లో కూడా శిక్షణ ఇచ్చి పంపారు.

నిర్మాణంలో పాలుపంచుకొన్న వాళ్లంతా అఫ్గానిస్థాన్‌ వారేనా?
కార్మికులు పూర్తిగా అఫ్గానిస్థాన్‌కు చెందిన వారే. సాంకేతిక నిపుణులు మనదేశంవారు. డిజైన్ల బాధ్యత కేంద్రజలసంఘ ఇంజినీర్లది. మనం నెలనెలా కనీస వేతనాలు ఇచ్చే వాళ్లం. అక్కడ ప్రభుత్వంలో ఉండేవాళ్లకు మూడు,నాలుగు నెలలకోసారి కూడా జీతాలు వచ్చేవికాదు. దీంతో ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు అనేకమంది ప్రాజెక్టు నిర్మాణంలో పని చేశారు. బాగా కష్టపడేవారు.

ఎంత ఆయకట్టుకు నీరందుతుంది?
ఈ ప్రాజెక్టు ద్వారా 75వేల హెక్టార్లకు సాగునీరందించడంతో పాటు 42 మెగావాట్ల విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది. అంతకు ముందు అఫ్గానిస్థాన్‌లో విద్యుదుత్పత్తి జీరో. ఇతర దేశాల నుంచి కొని తెచ్చుకొని పట్టణాల్లో కొంతవరకు మాత్రమే సరఫరా చేసేవారు. దీంతో ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ఎంతో ఉపయోగపడింది. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం జనరేటర్ల సాయంతోనే జరిగింది. సిమెంటు, స్టీలు కూడా వేర్వేరు దేశాల నుంచి వచ్చేవి. అన్నీ ఒక రకంగా ఉండేవి కాదు. దీంతో ప్రతి ఒక్కటీ పరీక్షించాల్సి వచ్చేది. అక్కడ ల్యాబ్‌లు లేవు కాబట్టి ఇక్కడికి తెచ్చి చేసే వాళ్లం. విద్యుదుత్పత్తికి బి.హెచ్‌.ఇ.ఎల్‌ టర్బైన్లు ఇరాన్‌ పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించేవాళ్లం. టిప్పర్లనీ అంతే. అక్కడ విద్యుత్తు లేకపోవడంతో పరిశ్రమలు కూడా లేవు.

కొత్తగా మరో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు కదా, ఏమైంది?
కాబుల్‌లో జనాబా ఎక్కువ. భూగర్బజలాలపైనే ఆధారపడాలి. దీంతో భూగర్భజలమట్టం 120 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లింది. నీటి సరఫరా లేదు. దీంతో ఇక్కడ ఒక ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారు చేశాం. మన ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. తర్వాత అక్కడి పరిణామాలతో ఆగిపోయింది.

అఫ్గానిస్థాన్‌లో భారత్‌ నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టు వివరాలేంటి?
హెరత్‌ ప్రొవిన్స్‌లోని హురిద్‌ నదిపై సల్మాడ్యాం ప్రాజెక్టును భారత్‌ నిర్మించి ఇచ్చింది. 1976లో దీని నిర్మాణం ప్రారంభమైంది. కొంత పని జరిగాక 1979లో సోవియట్‌ ఆక్రమణతో ఆగిపోయింది. 1988లో మళ్లీ ప్రారంభమైనా ముందడుగు పడలేదు. 2006లో మళ్లీ చేపట్టారు. భారత ప్రభుత్వం రూ.1,457 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వాప్కోస్‌కు అప్పగించారు. టెండర్లు పిలవగా భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బెంగళూరుకు చెందిన సల్మాడ్యాం జాయింట్‌ వెంచర్‌ ఈ పనిని దక్కించుకుంది. 107 మీటర్ల ఎత్తుతో ఎర్తెన్‌ రాక్‌ఫిల్‌డ్యాం, మూడు గేట్లతో స్పిల్‌వే నిర్మాణం. 2010 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం కాగా.. 2015 జులై 26కు పూర్తయ్యింది. 2016 జూన్‌4న మన ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. దీనికి  ఇండియా-అఫ్గానిస్థాన్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యాం అని పేరు పెట్టారు. పూర్తయ్యేటప్పటికి మొత్తం రూ.1,775 కోట్ల వ్యయమైంది.

తాలిబన్ల వల్ల ప్రాజెక్టు పనులకు అడ్డంకి కలగలేదా?
నిర్మాణ ప్రాంతంలో భారీ పోలీసు యూనిట్‌ ఉండేది. ఎక్కడికి వెళ్లినా మాతోపాటు కనీసం 20 వాహనాలు సెక్యూరిటీగా వచ్చేవి. కాబుల్‌ నుంచి హెరత్‌ ప్రొవిన్స్‌ 300 కి.మీ. అక్కడికి వెళ్లాలంటే కాందహార్‌ మీదుగా వెళ్లాలి. అది చాలా ప్రమాదం. అందుకని హెరత్‌ వరకు వాయుమార్గంలో వెళ్లి అక్కడి నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న సల్మా ప్రాజెక్టుకు వెళ్లేవాళ్లం. ఆ రోడ్లలో తిని బయలుదేరితే వాంతులు చేసుకోకతప్పదు.. అంత అధ్వానంగా ఉంటాయి. బిస్కెట్లు దగ్గర పెట్టుకుని  ఆకలి తీర్చుకోవడానికి మధ్యలో ఒకటి రెండు తినేవాళ్లం.  టయోటా కార్లు తప్ప వేరేవి ఉండేవి కాదు. ఆ ప్రాంతంలో ఆధిపత్యం సాధించిన వ్యక్తిని వార్‌లార్డ్‌ అనేవారు. ఇతని కిందనే అతను ఎంపిక చేసుకొన్న యూనిట్‌ ఉండేది. వాళ్లే పోలీసులు. వార్‌లార్డ్‌ మాతో వస్తున్నారంటే ఏదో జరుగుతుందనే భయం ఉండేది. ఒకసారి ప్రత్యక్షంగా కాల్పుల ఘటన చూశాం. పనుల పర్యవేక్షణకు పోయి తిరిగి వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ గడపడమే. 2013లో తాలిబన్లు ఈ ప్రాజెక్టును పేల్చడానికి ప్రయత్నించారు.  అయితే ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం అడ్డుకోగలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని