Updated : 21 Aug 2021 08:54 IST

Afghanistan: అఫ్గాన్‌ అంశంపై కలిసి ముందుకెళ్దాం.. భారత్, అమెరికా నిర్ణయం

 జైశంకర్‌కు ఫోన్‌ చేసిన బ్లింకెన్‌ 

వాషింగ్టన్‌: అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు మరోసారి చర్చించారు. అఫ్గాన్‌ విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను ఆక్రమించుకున్న క్రమంలో... బ్లింకెన్‌ సోమవారమే జైశంకర్‌తో మాట్లాడారు. శుక్రవారం మరోసారి ఫోన్‌ చేశారు. కాబుల్‌ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి రాగానే... అఫ్గాన్‌ నుంచి భారతీయులను తీసుకొస్తామని, ఈ విషయమై అమెరికాతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని జైశంకర్‌ అంతకుముందు వెల్లడించారు.

ధ్రువపత్రాలున్నా తప్పని తిప్పలు...

అఫ్గాన్‌ను విడిచి వెళ్లాలనుకునే వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాలిబన్లు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. వారిలో చాలామందికి చదవడం రాదు. దీంతో ధ్రువపత్రాలు ఉన్నా కొంతమందిని అడ్డుకుంటున్నట్టు సమాచారం. అన్ని పత్రాలు ఉన్నా, కాన్సుల్‌ అధికారుల నుంచి క్లియరెన్స్‌ రావడం చాలా జాప్యమవుతోంది. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట చాలామంది తమవంతు కోసం వేచి చూస్తున్నారు. గతంలో అమెరికా దళాలతో కలిసి పనిచేసినవారైతే... తాము దేశం విడిచి వెళ్లడం ఆలస్యమైతే, తాలిబన్లు తమను లక్ష్యం చేసుకుంటారని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిలో చాలామంది వద్ద ఎలాంటి పత్రాలూ లేకపోవడం వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది.

7 వేల మంది తరలింపు... 

ఈనెల 14 నుంచి ఇప్పటివరకు తాము సుమారు 7 వేల మందిని అఫ్గాన్‌ నుంచి తరలించినట్టు అమెరికా రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ‘‘కాబుల్‌లో ప్రస్తుతం 5,200 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. అక్కడి విమానాశ్రయం మా ఆధ్వర్యంలోనే భద్రంగా ఉంది. రోజూ 5 వేల నుంచి 9 వేల మందిని విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రజలు వచ్చేందుకు వీలుగా విమానాశ్రయంలో మరిన్ని ద్వారాలను తెరిచాం. కానీ, ధ్రువపత్రాల పరిశీలన కొంత జాప్యమవుతోంది. రాయబార సిబ్బందిని పెంచి, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అమెరికా సైనికాధికారి మేజర్‌ జనరల్‌ హంక్‌ టేలర్‌ చెప్పారు. కాబుల్‌ విమానాశ్రయంలో ప్రస్తుతం 6 వేల మంది తరలింపునకు సిద్ధంగా ఉన్నట్టు విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పారు.

బైడెన్‌ సర్కారు బాధ్యత వహించాలి: రిపబ్లికన్‌ సెనేటర్లు

బైడెన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే అఫ్గాన్‌లోని అమెరికా రక్షణ పరికరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని సుమారు 25 మంది రిపబ్లికన్‌ సెనేటర్లు విమర్శించారు. ఇందుకు బైడెన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని