Sanjay Raut: నాడు జిన్నాను గాడ్సే హత్యచేసి ఉంటే..!

అఫ్గానిస్థాన్‌లో నేటి సంక్షోభ పరిస్థితిని.. నాటి భారత విభజనతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పోల్చారు.

Published : 23 Aug 2021 13:17 IST

దేశ విభజన జరిగేది కాదు

అఫ్గాన్‌ పరిణామాలతో పోలుస్తూ శివసేన నేత రౌత్‌ వ్యాసం

ముంబయి: అఫ్గానిస్థాన్‌లో నేటి సంక్షోభ పరిస్థితిని.. నాటి భారత విభజనతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పోల్చారు. అఫ్గాన్‌లో తాజా పరిణామాలు.. ఓ దేశ ఉనికి, సార్వభౌమత్వం ధ్వంసం కావడం వల్ల కలిగే బాధను గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తమ పార్టీ పత్రిక ‘సామ్నా’లో ‘రోక్‌ఠోక్‌’ పేరిట రాసే వ్యాసంలో ఆదివారం ఆయన నాటి దేశ విభజన విషయాన్ని ఉటంకించారు. ‘‘నాడు గాడ్సే జిన్నాను హతమార్చి ఉంటే.. దేశ విభజన జరిగేది కాదు’’ అంటూ పలు అంశాలను పేర్కొన్నారు. ఆగస్టు 14న ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా రౌత్‌ ప్రస్తావించారు. ‘‘నాథూరామ్‌ గాడ్సే అప్పట్లో మహాత్మ గాంధీకి బదులు.. పాక్‌ ఏర్పాటుకు కారణమైన జిన్నాను హత్యచేసి ఉంటే అప్పుడు దేశ విభజనే జరిగేది కాదు. అలాగే ఆగస్టు 14న ‘విభజన విషాద స్మృతి దినం’ జరపాల్సిన అవసరమూ ఉండేది కాదు’’ అని రౌత్‌ పేర్కొన్నారు. విడిపోయిన ఒక భాగం మళ్లీ వెనక్కి వస్తే తప్ప విభజన గాయం ఎలా మానుతుందని రౌత్‌ ప్రశ్నించారు. అంతవరకు మనశ్శాంతి ఉండదని పేర్కొన్నారు. 

‘‘అఖండ హిందుస్థాన్‌ ఏర్పడాలని మనం అనుకున్నా.. అది సాధ్యమయ్యేలా లేదు. అయితే ఆశ పోదు కదా! ప్రధాని మోదీ అఖండ హిందుస్థాన్‌ను కోరుకుంటే స్వాగతిస్తాం. అయితే పాకిస్థాన్‌కు చెందిన 11 కోట్ల మంది ముస్లింల విషయంలో ఆయన ప్రణాళిక ఏమిటో చెప్పాలి. ముస్లింలకు ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని బ్రిటిష్‌ పాలకులు ప్రవేశపెట్టే నాటికి మహాత్మ గాంధీ క్రియాశీల రాజకీయాల్లో లేరు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఈ ప్రత్యేక ఓటింగ్, ముస్లింలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ రద్దు చేశారు. సహేతుకం కాని ముస్లిం నేతల డిమాండ్లను అప్పట్లో గాంధీ నిరాకరించడంతో వారంతా కాంగ్రెస్‌ను వీడారు’’ అని రౌత్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని