Gujarat High Court: బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని అవివాహితను ఒత్తిడి చేయగలమా?

‘‘ఆమెకు ఇంకా వివాహం కాలేదు.. అయినా తల్లి అయ్యింది!...తాను జన్మనిచ్చిన బిడ్డకు

Updated : 24 Aug 2021 11:30 IST

వెల్లడించాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుందా!

గుజరాత్‌ హైకోర్టు ముందు ధర్మ సంకటం

అహ్మదాబాద్‌: ‘‘ఆమెకు ఇంకా వివాహం కాలేదు.. అయినా తల్లి అయ్యింది!...తాను జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో వెల్లడించాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుందా? ఆ చిన్నారి జన్మకు కారకుడైన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందేనని ఆమెను ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో...సమాధానం తెలిసినా బహిర్గతం చేయని ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?’’ అంటూ ధర్మ సంకటమైన పలు ప్రశ్నలను గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి రేకెత్తించారు. బాలికపై అత్యాచారం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించటాన్ని సవాల్‌ చేస్తూ ఓ ముద్దాయి గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ పరేశ్‌  న్యాయబద్ధమైన పలు సందేహాలను వ్యక్తం చేశారు. వివాహం కాకుండానే, తన ఇష్టప్రకారంగా బిడ్డను కనేందుకు గర్భందాల్చిన మహిళపై ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని చర్యలు తీసుకోగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరితో కలిసి జీవిస్తున్నారనేది సమస్య కాబోదన్నారు. నగరాలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఉదంతాలను ‘ఆధునికం’ అని సమర్థించుకుంటారు. అదే గ్రామాల్లో అయితే తీవ్ర విమర్శలు వస్తాయని తెలిపారు. కొన్ని గిరిజన తెగల్లో  బిడ్డను కనటానికి మహిళకు వివాహ బంధం తప్పనిసరికాదు. 18ఏళ్ల వయసు రాక ముందే తల్లి కావడాన్ని అక్రమమైన వ్యవహారంగానూ అక్కడ పరిగణించరని పేర్కొన్నారు.కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళను అక్కడి వైద్యులు ఆ బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని కోరినప్పుడు. ‘నాకు తెలియదు. వెల్లడించడం ఇష్టంలేదు. తెలిసినా పేరు బహిర్గతం చేయడంపై ఆసక్తిలేదు’ అన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? ఇలాంటి కేసుల్లో ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని భావించగలం అని జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయ్‌ ప్రశ్నించారు.

ఇదీ జరిగింది..

జునాగఢ్‌కు చెందిన బాలిక వివాహం కాకుండానే ఓ వ్యక్తితో కలిసి జీవిస్తూ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన ఇష్టప్రకారమే ఇల్లు వదిలి వచ్చి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి ఆమె వయస్సు 16 ఏళ్లు. ఆ తర్వాత మరో రెండేళ్ల లోపే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. 2020, మార్చి 24వ తేదీకి ఆమెకు 18 ఏళ్లు నిండుతాయి. మార్చి 25న సహజీవనం చేస్తున్న వ్యక్తినే వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అది వాయిదాపడింది. బాలిక రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తండ్రి... మైనర్‌ అయిన తన కుమార్తెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దానిని నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని