Published : 26 Aug 2021 12:07 IST

చెప్పాపెట్టకుండా కాబుల్‌కు.. ప్రత్యేక విమానంలో వెళ్లిన ఇద్దరు అమెరికా చట్టసభ్యులు

సమాచారమివ్వకుండా పర్యటించడంపై శ్వేతసౌధం, సైన్యం ఆగ్రహం

వాషింగ్టన్‌: కల్లోలిత అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతున్నవేళ అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆకస్మికంగా సందర్శించడం తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముందుగా సమాచారమివ్వకుండానే వారు చేపట్టిన ఈ పర్యటనపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెథ్‌ మౌల్టన్‌ (డెమెక్రాట్‌), పీటర్‌ మీయర్‌ (రిపబ్లికన్‌) ప్రత్యేక విమానంలో మంగళవారం ఆకస్మికంగా కాబుల్‌ విమానాశ్రయానికి వెళ్లారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. విదేశీ పౌరులు, శరణార్థుల తరలింపు చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. మౌల్టన్, మీయర్‌ ఇద్దరూ గతంలో సైన్యంలో పనిచేసినవారే. ప్రస్తుతం ప్రతినిధుల సభకు సంబంధించిన సాయుధ సేవల కమిటీలో మౌల్టన్, విదేశీ వ్యవహారాల కమిటీలో మీయర్‌ సభ్యులుగా ఉన్నారు. అయితే- వారు చెప్పాపెట్టకుండా కాబుల్‌కు రావడంపై అమెరికా సైన్యం, విదేశాంగ శాఖ, శ్వేతసౌధం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చట్టసభ్యుల ప్రత్యేక విమానం నగరంలోకి ప్రవేశించడానికి కేవలం కొన్ని క్షణాల ముందే వారి పర్యటన గురించి తమకు సమాచారం అందిందని సైన్యం తెలిపింది. ఈ పర్యటన వల్ల ఇతరుల తరలింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తాయని పేర్కొంది.

తాలిబన్లు సహకరించాలి: బైడెన్‌
అఫ్గాన్‌ నుంచి విదేశీయులు, శరణార్థులను ఈ నెల 31లోగా బయటకు తరలించేందుకు తాము కృషిచేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. అయితే తాలిబన్లు సహకరిస్తేనే గడువులోగా ఆ చర్యలు పూర్తవుతాయని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారు కాబుల్‌ విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా తాలిబన్లు సహకరించాలని సూచించారు. తరలింపు చర్యలు ఆలస్యమయ్యే కొద్దీ అఫ్గాన్‌ గడ్డపై తమ బలగాలకు ముప్పు పెరుగుతుందన్న సంగతి తనకు తెలుసునన్నారు. ఐఎస్‌ఐఎస్‌-కె (ఐఎస్‌ఐఎస్‌ అనుబంధ సంస్థ) వంటి ఉగ్ర సంస్థలు అక్కడ దాడులకు కుట్ర పన్నే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘జి-7 సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించాలి’
అఫ్గాన్‌ సంక్షోభంపై తమ కూటమి నిర్వహించబోయే సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించాలని జి-7 దేశాలకు చెందిన పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డారు. అమెరికా సెనేటర్‌ బాబ్‌ మెనెండెజ్‌తో పాటు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఐరోపా సమాఖ్య (ఈయూ)కు చెందిన పలువురు నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా, దాని మిత్రపక్షాలు బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ.. సీమాంతర ఉగ్రవాదంపై ఇకముందు కూడా పోరాటం కొనసాగిస్తామని అందులో స్పష్టం చేశారు.

తనిఖీలు లేకుండానే తరలింపులా?: బైడెన్‌పై ట్రంప్‌ విమర్శలు
వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అనుసరిస్తున్న విధానాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. తనిఖీలు లేకుండానే అఫ్గాన్‌ నుంచి చాలామందిని విమానాల్లో బయటకు తరలిస్తుండటాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే వేల మంది ఉగ్రవాదులు ఈ తరలింపుల్లో భాగంగా విదేశాలకు చేరుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బైడెన్‌ అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు అప్పగించారు. అమెరికా పౌరులను అక్కడి నుంచి తీసుకురావడానికి ముందే బలగాలను ఉపసంహరించడం దారుణమైన విషయం. తద్వారా వేల మంది అమెరికన్ల ప్రాణాలను ఆయన ప్రమాదంలోకి నెట్టారు. ఇప్పటివరకు నాకు అందిన లెక్కల ప్రకారం.. అఫ్గాన్‌ నుంచి ఇటీవల 26 వేల మందిని బయటకు తీసుకురాగా.. వారిలో కేవలం 4 వేల మందే అమెరికన్లు. ఎన్ని వేల మంది ఉగ్రవాదులు అఫ్గాన్‌ నుంచి విదేశాలకు చేరుకొని ఉండొచ్చో దీన్నిబట్టి మనం ఊహించుకోవచ్చు. తనిఖీలు లేకుండా తరలింపులు చేపట్టడం ఘోర వైపల్యమే’’ అని ట్రంప్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు- మిలటరీ, నిఘావర్గాల సలహాలను ఖాతరు చేయకుండా అఫ్గానిస్థాన్‌లో సంక్షోభానికి బైడెన్‌ కారణమయ్యారని రిపబ్లికన్‌ పార్టీ శాసనకర్త మైక్‌ వాల్ట్జ్‌ ఆరోపించారు. బైడెన్‌ తీరును ఖండిస్తూ ప్రతినిధుల సభలో ఆయన ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని