Afghanistan Crisis: మా భవితవ్యం.. అంధకార బంధురం

‘మాకు భయంగా ఉంది. మా మాతృభూమి మొదటిసారి తాలిబన్ల కబంధహస్తాల్లోకి వెళ్లినప్పడు  మేము పుట్టకపోయినా.. వాళ్లంటే ఏమిటో మాకు తెలుసు. ప్రస్తుతం ..

Updated : 27 Aug 2021 12:34 IST

అఫ్గాన్‌ పిల్లల కళ్లలో భయాందోళనలు

దిల్లీ: ‘మాకు భయంగా ఉంది. మా మాతృభూమి మొదటిసారి తాలిబన్ల కబంధహస్తాల్లోకి వెళ్లినప్పడు  మేము పుట్టకపోయినా.. వాళ్లంటే ఏమిటో మాకు తెలుసు. ప్రస్తుతం మా దేశంలోని పిల్లలు, మహిళలు ఎంతగా అభద్రత భావానికి గురవుతుంటారో మాకు తెలుసు’.. పన్నెండేళ్ల దియానా నోటి వెంట వచ్చిన మాటలివి. దిల్లీలోని శరణార్థుల కాలనీలో ఉంటున్న అఫ్గాన్లు అక్కడి ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ హై కమిషనర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళనలో అక్కాచెల్లెళ్లు దియా (10), దియానా పలువురి దృష్టిని ఆకర్షించారు. సరదా గా బాల్యం గడపాల్సిన వయసులో వీరిద్దరూ మం డుటెండలో తల్లిదండ్రులతోపాటు కూర్చొని, అఫ్గాన్‌లోని తమ సోదరీమణులను ఆదుకోవాలంటూ గళం విప్పారు. గత సోమవారం మొదలైన ఈ రిలే ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్‌ శరణార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు అనుమతించాలని, భారత్‌లో తమకు మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరుతూ దీక్షాశిబిరంలో వీరు బైఠాయించారు. మొదటిరోజు దిల్లీతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉంటున్న అఫ్గాన్లు కూడా తరలివచ్చారు. పెద్దల వెంట వచ్చిన పిల్లలు, యువత ఈ దీక్షల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎనిమిదేళ్ల తమ్ముడు మహమ్మద్‌ రమీన్‌తోపాటు దీక్షలో కూర్చొన్న జులేఖా ఖాదర్ఖిల్‌ (10) తాలిబన్లు బాలికావిద్యపై చూపుతున్న వివక్షను సూచించే బొమ్మతో ప్లకార్డు పట్టుకొంది. రమీన్‌ తాలిబన్‌ వ్యతిరేక నినాదాల్లో శ్రుతి కలుపుతున్నాడు. ‘మా భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంది. అఫ్గానిస్థాన్‌లోని పిల్లలను అభద్రతాభావం నుంచి కాపాడాల’ని జులేఖా కోరింది.

మరో 35 మంది తరలింపు
దిల్లీ: ‘ఆపరేషన్‌ దేవీశక్తి’ కింద అఫ్గాన్‌ నుంచి గురువారం మరో 35 మందిని సైనిక రవాణా విమానంలో దిల్లీకి తరలించారు. వీరిలో 24 మంది భారతీయులు, 11 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. నిజానికి 180 మందిని తీసుకురావాలనేది ప్రణాళిక కాగా మిగిలినవారు విమానాశ్రయానికి చేరుకోలేకపోయారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని