Published : 28 Aug 2021 10:06 IST

Afghanistan: గడువుకు ముందే తరలింపు పూర్తి చేసిన ప్రపంచ దేశాలు

లండన్‌/పారిస్‌/వెల్లింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులతో పలు దేశాలు ప్రజల తరలింపు ప్రక్రియను గడువు కంటే ముందే పూర్తిచేశాయి. ఆగస్టు 31 లోపు అమెరికన్లను స్వదేశం తీసుకెళ్లిపోవాలని తాలిబన్లు అమెరికాకు డెడ్‌లైన్‌ పెట్టారు. దీంతో అగ్రరాజ్యం కంటే రెండు రోజుల ముందే మిగతా దేశాలు.. తమ వాళ్ల తరలింపు ముగించాలని నిర్ణయించాయి. తమను తీసుకెళ్లాలంటూ అఫ్గాన్‌ వాసుల నుంచి వెల్లువెత్తుతున్న దరఖాస్తుల స్వీకరణ నిలిపేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, పోలండ్, బెల్జియం, జపాన్‌ దేశాలు ఇప్పటికే తరలింపు పూర్తయినట్లు ప్రకటించాయి. మరోవైపు కాబుల్‌లో పేలుళ్లు జరిగినప్పటికీ తమ వాళ్లను స్వదేశం తీసుకెళ్లే ప్రక్రియ ఆపబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టంచేశారు. ఈ నెల 14 నుంచి తాము 1.1 లక్షల మందిని తరలించినట్టు పెంటగాన్‌ వెల్లడించింది.

15 వేల మంది తరలింపు: బోరిస్‌ జాన్సన్‌
అఫ్గాన్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్లేందుకు అర్హత, అనుమతి ఉన్నవారందరినీ తరలించినట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. కాబుల్‌ నుంచి తమ వాయుసేన విమానాల ద్వారా 15 వేల మందిని తీసుకెళ్లామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా మిగిలిఉంటే తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాబుల్‌ నుంచి 500 మంది జర్మన్లు, 4 వేల మంది అఫ్గానీలు సహా మొత్తం 5,437 మందిని తరలించినట్టు జర్మనీ తెలిపింది. కాబుల్‌ నుంచి తమ ప్రజలను పాకిస్థాన్‌కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు బెల్జియం ప్రకటించింది.  పోలండ్‌ కూడా తమ పౌరుల తరలింపు ముగిసినట్టు స్పష్టం చేసింది. కాబుల్‌లో శుక్రవారం రాత్రితో తమవాళ్ల తరలింపు పూర్తయిందని ఫ్రాన్‌ పేర్కొంది. అఫ్గాన్‌లో మిగిలిపోయిన తమ పౌరులు, సిబ్బందిని శుక్రవారం 4 మిలటరీ విమానాలలో సురక్షితంగా తీసుకొచ్చినట్టు జపాన్‌ ప్రకటించింది. కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయంలో ఉన్న తమ పౌరులందరికీ శుక్రవారం చివరి విమానంలో తరలించామని ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగి డి మైయో తెలిపారు.

అమెరికా విజ్ఞప్తిని అంగీకరించిన పాక్‌
అఫ్గాన్‌ నుంచి  తరలివచ్చేవారిలో 4 వేల మందికి తాత్కాలికంగా ప్రత్యేక ఆశ్రయమిచ్చేందుకు పొరుగునున్న పాకిస్థాన్‌ సన్నాహాలు చేస్తోంది. నాటో దళాలకు మద్దతుగా పనిచేసిన అఫ్గాన్లకు సాయం చేయాలంటూ అమెరికా విజ్ఞప్తి చేయడంతో పాక్‌ ఇందుకు అంగీకరించింది. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమయ్యాక నెలకొన్న భయానక పరిస్థితులతో.. 5.15 లక్షల మంది ఆ దేశం నుంచి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తెలిపింది.

అఫ్గాన్‌ ఉద్యోగుల వివరాలు గాలికొదిలేసి..
విదేశీ బలగాలు, అధికారులకు సహకరించిన అఫ్గానిస్థాన్‌ పౌరులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నవేళ కాబుల్‌లోని బ్రిటన్‌ రాయబార కార్యాలయం అధికారుల ఓ నిర్వాకం తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. అఫ్గానిస్థాన్‌లో తమ వద్ద పనిచేసిన పలువురు స్థానికుల వివరాలను వారు కార్యాలయంలోనే వదిలేసి వెళ్లారు. చెల్లాచెదురుగా పడిఉన్న సదరు పత్రాలను తాను చూశానని ‘టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’ విలేకరి ఒకరు వెల్లడించారు.

దిల్లీలో అఫ్గాన్‌ శరణార్థుల నిరసన
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఐరాస శరణార్థుల హైకమిషనర్‌ కార్యాలయం (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ఎదుట అఫ్గానిస్థాన్‌కు చెందిన పలువురు శరణార్థులు శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన కొనసాగించారు. తమను అధికారికంగా శరణార్థులుగా గుర్తించే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అఫ్గాన్‌ సంఘీభావ కమిటీ (ఏఎస్‌సీ) నేతృత్వంలో ఈ నెల 23 నుంచి వీరు నిరసన కొనసాగిస్తున్న సంగతి గమనార్హం.

భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం: తాలిబన్‌
భారత్‌తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబన్లు తెలిపారు. తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ తాజాగా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌ సహా అన్ని దేశాలతో మేం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ప్రాంతీయంగా కీలకమైన దేశాల్లో భారత్‌ ఒకటి. అఫ్గానిస్థాన్‌ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశం తమ విధానాలను రూపొందించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సహకారం అవసరం.. భారత్, ఇటలీ ప్రధానుల చర్చలు  
దిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇటలీ ప్రధాని మారియో ద్రాఘితో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లోని పరిణామాలను ఇద్దరు నేతలు చర్చించారు. అక్కడి సవాళ్లను ఎదుర్కోవడానికి జీ-20 కూటమి, అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించాక ఈ ప్రాంతం, ప్రపంచవ్యాప్తంగా తలెత్తే పరిణామాలపైనా వారు చర్చించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts