Covaxin: కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కొవాగ్జిన్‌తో రెండింతల లబ్ధి 

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కొవాగ్జిన్‌ టీకా వేసినప్పుడు రెట్టింపు ప్రయోజనం కలుగుతోందని

Published : 29 Aug 2021 13:50 IST

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి  

దిల్లీ: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి ఒక డోసు కొవాగ్జిన్‌ టీకా వేసినప్పుడు రెట్టింపు ప్రయోజనం కలుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. వ్యాధి బారినపడని వారితో పోలిస్తే వీరికి ఒక డోసు వల్ల రెండు డోసుల స్థాయిలో యాంటీబాడీ స్పందన కలుగుతోందని తేలింది. ఈ అధ్యయన వివరాలు ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’లో తాజాగా ప్రచురితమయ్యాయి. ‘‘ప్రాథమికంగా వెల్లడైన ఈ అంశాలు విస్తృత స్థాయి అధ్యయనాల్లోనూ రుజువైతే.. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒకే డోసు కొవాగ్జిన్‌ను సిఫార్సు చేయవచ్చు.

టీకాలు పరిమితంగానే సరఫరా అవుతున్న నేపథ్యంలో.. కొవిడ్‌ బారినపడని వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది’’ అని అధ్యయనం పేర్కొంది. కొవాగ్జిన్‌.. భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మొదటి టీకా. దీన్ని 4-6 వారాల విరామంతో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకాతో కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను అడ్డుకునే నిర్దిష్ట యాంటీబాడీల స్పందన తీరును పరిశీలించేందుకు ఐసీఎంఆర్‌ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా చెన్నైలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకూ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కొవాగ్జిన్‌ మొదటి డోసు పొందిన 114 మంది ఆరోగ్య నిపుణులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను నిపుణులు పరిశీలించారు. టీకా వేసిన రోజున, 28 రోజులు, 56 రోజుల తర్వాత వీరిలో యాంటీబాడీ స్పందనను పరిశీలించారు. వ్యాక్సిన్‌కు ముందు కరోనా సోకిన వారికి, ఇన్‌ఫెక్షన్‌ సోకనివారికి మధ్య ఈ స్పందనలో తేడాలను గమనించారు. ‘‘మొత్తం మీద చూస్తే కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో టీకా వల్ల యాంటీబాడీ స్పందన అద్భుతంగా ఉంది’’ అని అధ్యయనం వివరించింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని