Kabul Blasts: పాకిస్థాన్‌ నుంచే ఆర్‌డీఎక్స్‌..!

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దానికి పాకిస్థాన్‌తో ఏదో ఒక విధంగా సంబంధం

Updated : 29 Aug 2021 18:29 IST

కాబుల్‌: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దానికి పాకిస్థాన్‌తో ఏదో ఒక విధంగా సంబంధం ఉంటుందన్న వాదన మరోసారి రుజువైంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో ఎందరో ప్రాణాలను బలిగొన్న ఉగ్రఘాతుక చర్యలోనూ ముష్కరులకు పేలుడు పదార్థాలను అందించింది పాకిస్థానేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాబుల్‌ విమానాశ్రయం సమీపంలో ఐసిస్‌-కె ఉగ్రవాద ముఠా గురువారం ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ముష్కర చర్యలో 169 మంది అఫ్గాన్‌ పౌరులతో పాటు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారుల అంచనా ప్రకారం ఈ దాడికి ఉగ్రవాదులు 11 కేజీల ఆర్‌డీఎక్స్‌ను ఉపయోగించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్, హెల్మెట్‌ సహా అమెరికా సైన్యం ధరించే అత్యుత్తమ రక్షణ సాధనాలను సైతం ధ్వంసం చేయగలిగే శక్తిమంతమైన పేలుడు పదార్థాలను వాడినట్లు తెలుస్తోంది. ఇవి పాక్‌ నుంచే ఉగ్రవాదులకు అందినట్లు సమాచారం.

‘‘పాకిస్థాన్‌లోని పెషావర్, క్వెట్టా నగరాల నుంచే ఐసిస్‌-కెకి బాంబుదాడులకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోంది. తలకు చుట్టుకునే పాగాల్లోను, కూరగాయల బళ్లలోనూ పేలుడు పదార్థాలను నింపి, వాటిని సరిహద్దు దాటిస్తున్నారు. పేలుడు పదార్థాలతో పాటు డబ్బును సైతం ఇలాగే పంపిస్తున్నారు’’ అని కాబుల్‌లోని అఫ్గాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ (ఏఐఎస్‌ఎస్‌) ఓ నివేదికలో వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పాటు ఐసిస్‌ ఉగ్రవాదులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను రూపొందించింది. ఐసిస్‌-కె ముఠా సభ్యుల్లో 90% మంది పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందినవారేనని నివేదికలో తెలిపింది. ఐసిస్‌ ముష్కరులను ప్రశ్నించగా.. తమ ఆయుధాలు పాకిస్థాన్‌లో తయారయ్యాయని చెప్పినట్లు పేర్కొంది. ఐసిస్‌ ముఠాకి పాకిస్థాన్‌ అండగా ఉంటోందన్న విషయాన్ని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని