Afghanistan: నాడు బైడెన్‌ను కాపాడి.. నేడు బిక్కుబిక్కుమంటూ!

అఫ్గానిస్థాన్‌లో తరలింపు చర్యలను అమెరికా బలగాలు హడావుడిగా ముగించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి.

Updated : 12 Mar 2024 16:53 IST

తనను రక్షించాలని అఫ్గానీ అనువాదకుడి మొర 

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తరలింపు చర్యలను అమెరికా బలగాలు హడావుడిగా ముగించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్‌లో ఏళ్ల పాటు తమకు సేవలందించిన పలువుర్ని అక్కడే వదిలేసి వెళ్లిన అగ్రరాజ్యం.. ప్రస్తుతం తమ దేశాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ను ఒకప్పుడు కాపాడిన స్థానికుడినీ శరణార్థిగా తీసుకెళ్లకపోవడం గమనార్హం. సెనేటర్‌గా ఉన్నప్పుడు 2008లో బైడెన్‌ అఫ్గాన్‌ పర్యటనకు వెళ్లారు. రెండు హెలికాప్టర్లలో ఆయన బృందం ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. దీంతో హెలికాప్టర్లను అత్యవసరంగా ఓ మారుమూల లోయలో దించారు. ఆ వెంటనే భద్రత దళాలకు సమాచారం అందింది. అయితే ఆ మారుమూల ప్రాంతానికి చేరుకోవడం బలగాలకు కష్టమైంది. అప్పుడు మహమ్మద్‌ అనే ఓ అనువాదకుడు వారికి సహాయం చేశాడు. ప్రతికూల వాతావరణంలో, కొండ ప్రాంతాలను దాటి లోయను చేరుకునే మార్గం చూపాడు. ఫలితంగా బలగాలు బైడెన్‌ను, ఆయన బృందాన్ని రక్షించగలిగాయి. నాడు మహమ్మద్‌ చేసిన సహాయాన్ని పలువురు అమెరికా అధికారులు ప్రశంసించారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. గతంలో అగ్రరాజ్య బలగాలకు సహాయం చేసినందుకుగాను తనను, తన కుటుంబాన్ని తాలిబన్లు చంపేస్తారేమోనని మహమ్మద్‌ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు.  ఈ వ్యవహారంపై శ్వేతసౌధం స్పందించింది. మహమ్మద్‌ను రక్షిస్తామని హామీ ఇచ్చింది. అతడి కుటుంబాన్ని బయటకు తీసుకొస్తామని శ్వేతసౌధం ప్రెస్‌సెక్రటరీ జెన్‌ సాకి చెప్పారు.

బగ్రామ్‌ వైమానిక స్థావరంపై చైనా కన్ను! 

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆ దేశంలోని కీలక బగ్రామ్‌ వైమానిక స్థావరంపై చైనా కన్నేసే అవకాశముందని అమెరికాకు చెందిన మాజీ దౌత్యవేత్త నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఆ స్థావరం డ్రాగన్‌కు చిక్కకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా హేలీ గతంలో పనిచేశారు. తాజాగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. 

కాబుల్‌లో భేటీకి మేం సిద్ధం 

బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా తమతో పాటు అమెరికా, పాకిస్థాన్‌లను కలుపుకొని కాబుల్‌లో త్వరలోనే సమావేశం నిర్వహించేందుకు రష్యా చేసిన ప్రతిపాదనపై చైనా సానుకూలంగా స్పందించింది. అఫ్గాన్‌లో శాంతిస్థాపనకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని ఉద్ఘాటించింది.

సరిహద్దులు మూసుకున్న పాక్‌!

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌ తాలిబన్లను వెనకేసుకొస్తున్న పాకిస్థాన్‌... ఆ దేశం నుంచి శరణార్థులెవరూ తమ భూభాగంలో ప్రవేశించకుండా కీలక సరిహద్దులను మూసివేసింది! భద్రత కారణాలతో ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని తోఖ్రాం సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేసింది. గురువారం ఉదయం అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ- భద్రత కారణాల రీత్యా చమన్‌ క్రాసింగ్‌ను కొద్ది రోజులపాటు మూసి ఉంచుతామన్నారు. దీన్ని మళ్లీ ఎప్పుడు తెరుస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. సరిహద్దుల్లో తమ భద్రత సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారని, దేశ పరిరక్షణకు వారు ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పారు. అఫ్గాన్‌లో శాంతి, సుస్థిరతలను పాకిస్థాన్‌ కోరుకుంటోందన్నారు.

తాలిబన్లను ‘గుర్తించేందుకు’ తొందరేం లేదు :అమెరికా

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను అధికారిక పాలకులుగా గుర్తించేందుకు తొందరేం లేదని అమెరికా పేర్కొంది. వారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా? పాలనలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తారా? అనేవి మున్ముందు పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. తాలిబన్ల భవిష్యత్‌ చర్యలను బట్టే.. వారికి గుర్తింపునిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ సాకి బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు పలు విషయాలు వెల్లడించారు. తమ ప్రయోజనాల నిమిత్తం అవసరమైనప్పుడల్లా ఇకముందు కూడా తాలిబన్లతో చర్చలు జరుపుతామని అమెరికా స్పష్టం చేసింది.

‘మారారో లేదో చూడాలి’ 

తాలిబన్‌ ముఠా సభ్యులు గతంలో అత్యంత క్రూరంగా వ్యవహరించేవారని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లె చెప్పారు. వారు మారారా? లేదా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని