Perseverance rover: అంగారకుడిపై రాతి నమూనా సేకరణ

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌..

Published : 04 Sep 2021 10:32 IST

విజయవంతంగా పూర్తి చేసిన నాసా రోవర్‌

కేప్‌ కెనావెరాల్‌: అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌.. అంగారకుడిపై ఒక కీలక మైలురాయిని సాధించింది. అరుణ గ్రహం నుంచి విజయవంతంగా రాతి నమూనాను సేకరించింది. కొన్నేళ్ల తర్వాత వీటిని భూమికి తీసుకొస్తారు. రాతి నమూనా అద్భుతంగా ఉందని రోవర్‌ ముఖ్య ఇంజినీర్‌ ఆడమ్‌ స్టెల్జనర్‌ తెలిపారు. ‘‘దాన్ని సేకరించడం వల్ల అంగారకుడి శిలపై ఏర్పడ్డ రంధ్రం చూసి నాకు అమితానందం కలిగింది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. గత నెలలో రాతి నమూనా సేకరణకు పర్సెవరెన్స్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. నాడు ఈ రోవర్‌.. ఒకింత మృదువైన శిలకు డ్రిల్లింగ్‌ నిర్వహించింది. అయితే ఈ నమూనా ముక్కలైపోయింది. దీంతో రోవర్‌లోని టైటానియం గొట్టంలోకి అది చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రోవర్‌.. అక్కడి నుంచి అర మైలు ప్రయాణించి, ‘రొషెట్‌’ అనే మరో శిలను ఎంపిక చేసుకుంది. దాని నుంచి విజయవంతంగా నమూనాను సేకరించింది.

పర్సెవరెన్స్‌ పంపిన ఫొటోలు, డేటాను విశ్లేషించిన ఇంజినీర్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంగారుడిపైనున్న జెజెరో బిలంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో పర్సెవరెన్స్‌ దిగిన సంగతి తెలిసిందే. వందల కోట్ల ఏళ్ల కిందట అక్కడ నది ప్రవహించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల అక్కడి శిలల్లో పురాతన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా. పర్సెవరెన్స్‌ సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావడానికి ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా ఈ దశాబ్దం చివర్లోగా మరికొన్ని వ్యోమనౌకలను పంపుతుంది. మొత్తం మీద 30 నమూనాలను పుడమికి రప్పించాలని భావిస్తున్నారు. పర్సెవరెన్స్‌.. అంగారకుడిపై దిగిన ప్రదేశం నుంచి ఇప్పటివరకూ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని