Lockdown effect on diabetes: మధుమేహం ముప్పును పెంచిన లాక్‌డౌన్‌

కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ల వల్ల అనేక మంది బరువు పెరిగారని,

Published : 05 Sep 2021 10:57 IST

లండన్‌: కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ల వల్ల అనేక మంది బరువు పెరిగారని, ఫలితంగా వారికి టైప్‌-2 మధుమేహం ముప్పు ఎక్కువైందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌’ (ఎన్‌హెచ్‌ఎస్‌) చేపట్టిన మధుమేహ నివారణ కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో భాగంగా 40 ఏళ్లలోపు వారి డేటాపై అధ్యయనం చేశారు. మూడేళ్ల ముందు ఈ కార్యక్రమంలో చేరిన వారితో పోలిస్తే తాజాగా ఇందులో పాలుపంచుకున్న వారి బరువు సరాసరిన 3.6 కిలోల మేర పెరిగినట్లు గుర్తించారు. శరీర బరువు కిలో మేర పెరిగినా మధుమేహం ముప్పు 8 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘మహమ్మారి వల్ల మన జీవితంలోని ప్రతి అంశమూ మారింది. మన శరీరం, మనసుపై పెను ప్రభావం పడింది. దీనివల్ల అనేకమంది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బరువు పెరిగారు. దీనివల్ల టైప్‌-2 మధుమేహమే కాకుండా.. దానితో ముడిపడిన క్యాన్సర్, అంధత్వం, గుండె పోటు, పక్షవాతం వంటి వాటి ముప్పు కూడా పెరిగింది’’ అని ఎన్‌హెచ్‌ఎస్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ వాలాభ్జి తెలిపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మన జీవన విధానంలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్పారు. ‘‘టైప్‌-2 మధుమేహం అనేది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. దీనికి వయసు, కుటుంబం ఆరోగ్య నేపథ్యం, జాతి వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. వీటితో పోలిస్తే ఊబకాయం అతిపెద్ద ముప్పు. ఇది 80-85 శాతం మేర మధుమేహానికి చేరువ చేస్తుంది’’ అని డాన్‌ హోవర్త్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని