Covid: కొవిడ్‌ బాధిత చిన్నారుల్లో ఊపిరితిత్తులు పదిలమే!

కొవిడ్‌-19 ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్‌ఫెక్షన్‌. అయితే మహమ్మారి వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఈ అవయవ పనితీరు పెద్దగా దెబ్బతినడంలేదనే సానుకూలాంశాన్ని ..

Updated : 08 Sep 2021 12:37 IST

లండన్‌: కొవిడ్‌-19 ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్‌ఫెక్షన్‌. అయితే మహమ్మారి వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఈ అవయవ పనితీరు పెద్దగా దెబ్బతినడంలేదనే సానుకూలాంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉబ్బస వ్యాధి ఉన్నవారిలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించిందని తెలిపారు. అయితే వీరు ఒక సెకనులో  గట్టిగా బయటకు వదలగలిగే గాలి పరిమాణం ఒకింత తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ వివరాలను ‘యూరోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌’ కార్యక్రమంలో విడుదల చేశారు. తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌ బారినపడినవారిని మినహాయిస్తే పిల్లలు, కౌమారప్రాయుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినలేదని తేల్చారు. ‘‘ఇన్‌ఫెక్షన్‌ తగ్గాక ఊపిరితిత్తులపై మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు చెలరేగాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న చిన్నవయస్కుల విషయంలో ఈ సందేహాలు ఎక్కువగా వచ్చాయి’’ అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకురాలు ఇదా మోగెన్సెన్‌ చెప్పారు. ఈ అధ్యయనంలో 661 మందిపై పరిశోధన జరిపారు. వీరి నుంచి ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన కీలక పరామితులు, ఇన్‌ఫ్లమేషన్, తెల్ల రక్తకణాలను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని