Updated : 12 Sep 2021 15:15 IST

Afghanistan: పిల్లల్ని కనండి.. పదవులు అడగొద్దు

వనితలకు తాలిబన్ల మొండిచెయ్యి

కాబుల్‌: అఫ్గాన్‌ మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలని.. వారికి మంత్రి పదవులు అనవసరమని తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్‌ సర్కారులో తమకు స్థానం కల్పించాలని కోరుతూ అక్కడి మహిళలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 7న అఫ్గాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లు మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వడం లేదన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక టోలో న్యూస్‌ ఇంటర్వ్యూలో జెక్రుల్లా హాషిమి మాట్లాడుతూ.. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుంది. వారు పిల్లలకు జన్మనిస్తే చాలు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరు’ అని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు సగభాగం కదా.. అనే ప్రశ్నకు తాము అలా భావించడం లేదన్నారు. ‘మహిళలకు చోటిచ్చి, గత 20 ఏళ్లుగా మా కార్యాలయాల్లో జరిగింది వ్యభిచారమేగా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా

అఫ్గానిస్థాన్‌లో సెప్టెంబర్‌ 11న జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకున్నారు. గతంలో న్యూయార్క్‌ ట్విన్‌ టవర్స్‌ను కూల్చిన ఇదే రోజు (9/11) ప్రమాణస్వీకారం నిర్వహించాలని చూసినా.. మిత్రపక్ష దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు.

9/11 తేదీన వేడుకకు రాలేం: రష్యా

పాకిస్థాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతర్‌ తదితర దేశాలకు తాలిబన్లు ప్రమాణస్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. రష్యా సహా మరికొన్ని మిత్రదేశాలు సెప్టెంబర్‌ 11న జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకాలేమని పేర్కొన్నట్లు సమాచారం. అమానవీయ ఘటన జరిగిన రోజున తాలిబన్లు నిర్వహిస్తున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావద్దని అమెరికా.. ఖతర్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కాస్త వెనక్కుతగ్గి.. కేబినెట్‌ ఏర్పాటును వాయిదా వేసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని