Taliban: అమెరికా బలగాల కళ్లుగప్పి.. ఏళ్లపాటు కాబుల్‌లోనే ఉన్నా

అమెరికా బలగాలు, అఫ్గానిస్థాన్‌ సైనికుల కళ్లుగప్పి తాను ఏళ్లపాటు కాబుల్‌లోనే ఉన్నానని తాలిబన్‌ అధికార ప్రతినిధి

Published : 13 Sep 2021 13:09 IST

తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ 

ఇస్లామాబాద్‌: అమెరికా బలగాలు, అఫ్గానిస్థాన్‌ సైనికుల కళ్లుగప్పి తాను ఏళ్లపాటు కాబుల్‌లోనే ఉన్నానని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ తెలిపారు. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్న ముజాహిద్‌ (43).. గత నెల్లో తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్నాక మీడియా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి విలేకర్ల సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తను అజ్ఞాతంలో ఉన్నప్పటి వివరాలను తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన వెల్లడించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని నౌషెరాలో ఉన్న హక్కానియా విద్యాలయంలో తాను చదువుకున్నట్లు చెప్పారు. ‘‘మా శత్రువులైన అఫ్గాన్, అమెరికా సైనికుల సోదాల్లో దొరక్కుండా నేను చాలాసార్లు తప్పించుకున్నా. వారి కళ్లు గప్పి కాబుల్‌లోనే దీర్ఘకాలంపాటు నివసించా. దేశమంతా తిరిగా. ప్రభుత్వ బలగాల గురించి చాలా రహస్య సమాచారం సేకరించడం ద్వారా మా ముఠాకు సాయపడ్డా. ఆ సమాచారమంతా తాలిబన్లకు ఎలా తెలుస్తోందో సైన్యానికి అర్థమయ్యేది కాదు. నా ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా బలగాలు స్థానికులకు డబ్బులు కూడా చెల్లించేవి. వారిచ్చిన సమాచారంతో నిఘా కార్యకలాపాలను కొనసాగించేవి. అయినా నేనెప్పుడూ అఫ్గాన్‌ను వీడి వెళ్లాలనుకోలేదు’’ అని ముజాహిద్‌ వివరించారు. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ను తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. ఒమర్‌ వారసులైన షేక్‌ ముల్లా మన్సూర్, షేక్‌ హెబతుల్లాల నాయకత్వంలోనే పనిచేసినట్లు తెలిపారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు