Afghanistan: ప్రాణభయంతో కళాకారులు దేశం విడిచి వెళ్లేందుకు యత్నాలు 

అఫ్గానిస్థాన్‌లో సంగీత కళాకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది! 1990ల నాటి పాలన తరహాలోనే తాలిబన్లు

Published : 13 Sep 2021 22:25 IST

పెషావర్‌: అఫ్గానిస్థాన్‌లో సంగీత కళాకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది! 1990ల నాటి పాలన తరహాలోనే తాలిబన్లు మళ్లీ సంగీతంపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో వారు కాబుల్‌ సహా పలు నగరాల్లో తమ కార్యాలయాలను మూసివేస్తున్నారు. కొందరు కళాకారులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్గాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తాము సంగీతంపై నిషేధం విధిస్తున్నదీ లేనిదీ ఇంకా ప్రకటించలేదు. అయితే గతం తాలూకు చేదు జ్ఞాపకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు సంగీత కార్యక్రమాలు రద్దయ్యాయి. కళాకారులు తమ సాధనాలను వదిలేస్తున్నారు. కొందరు గాయకులు భయంతో పాకిస్థాన్‌కు వలస వెళ్తున్నారు. ‘‘కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత నా వేషధారణ మార్చుకొని పెషావర్‌కు వచ్చేశాను. తాలిబన్లతో మాకు శత్రుత్వమేమీ లేదు. వారిని సోదరులుగానే భావిస్తున్నాం. కానీ మా వృత్తి వారికి నచ్చదు. కాబట్టి వారి పాలనలో మాకు రక్షణ ఉండదు’’ అని అజ్మల్‌ అనే ఓ గాయకుడు చెప్పుకొచ్చారు. అఫ్గాన్‌లోని బగ్లాన్‌ ప్రావిన్సులో ఫవాద్‌ అందరాబీ అనే జానపద కళాకారుడిని తాలిబన్లు ఇటీవల దారుణంగా కాల్చిచంపారు. అప్పటి నుంచి కళాకారుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ప్రాణభయంతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పాకిస్థాన్‌లోనూ అఫ్గానీ కళాకారులతో నడిచే కార్యాలయాలు మూతపడుతున్నాయి. కచేరీలు రద్దవుతున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని