Kerala High Court: మద్యం కొనేవారిని పశువుల్లా చూడొద్దు

మద్యం కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చే వారివల్ల ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా

Published : 17 Sep 2021 13:10 IST

ఎక్సైజ్‌ శాఖకు కేరళ హైకోర్టు చీవాట్లు

కోచి: మద్యం కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చే వారివల్ల ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్‌ శాఖకు, రాష్ట్ర బెవెరేజెస్‌ కార్పొరేషన్‌కు ఉంటుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం దుకాణాల ముందు వినియోగదారులు బారులు తీరి నిలబడుతున్నారని, ఈ పరిస్థితి చూపరులకూ ఆవేదన కలిగిస్తుందని జస్టిస్‌ డి.రామచంద్రన్‌ పేర్కొన్నారు. మద్యం కొనుగోలుదారులను పశువుల్లా చూడడం తగదని చెప్పారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ రెండు శాఖలకు ఉందని గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం దుకాణాల వల్ల పరిసర ప్రాంతవాసులకు, ఆ మార్గంలో వెళ్లే ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలపై ఫిర్యాదు చేసే ప్రజలను అగౌరవపరిచేలా,  పరిహసించేలా వ్యవహరించరాదని న్యాయమూర్తి సూచించారు. పరిసర ప్రాంతాల వారికి ఇబ్బందులు కలిగించని విధంగా మద్యం దుకాణాలను ఎలా నిర్వహించాలో సూచిస్తూ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఒక మద్యం దుకాణాన్ని బ్యాంకుకు అత్యంత సమీపంగా ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేస్తూ కొట్టాయంకు చెందిన ఓ గృహిణి రాసిన లేఖపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని