
Afghanistan: అబలపై ఆగని తాలిబన్ దమనకాండ.. మహిళా మంత్రిత్వశాఖ భవనం ఆక్రమణ
అందులో మత ప్రచార శాఖ ఏర్పాటు
కాబుల్: సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.. మైనారిటీలను పట్టించుకోలేదు.. ఒక్క మహిళకూ మంత్రి మండలిలో చోటు కల్పించలేదు.. అని ప్రపంచమంతా విమర్శిస్తున్నా, తాలిబన్లు ఖాతరు చేయడం లేదు. తమ అరాచక పాలనను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగా.. శనివారం మరో దుశ్చర్యకు దిగారు. గత ప్రభుత్వ హయాంలోని మహిళా మంత్రిత్వశాఖ భవనంలోకి చొరబడి.. అక్కడి సిబ్బందిని బయటికి పంపేశారు. తాత్కాలిక మంత్రిమండలిని ప్రకటించినప్పుడే.. తాలిబన్లు మహిళా మంత్రిత్వశాఖ ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఇప్పుడు ఆ శాఖ భవనాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ఆ భవనంలో ప్రపంచ బ్యాంకు చేపట్టిన 100 మిలియన్ డాలర్ల మహిళా ఆర్థిక సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కోసం సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరినీ తాలిబన్లు గెంటేశారు. అందులో కొత్తగా ప్రకటించిన ధర్మ ప్రచార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయనున్నారు. ఇస్లాం చట్టాలను కఠినంగా అమలుపరచే బాధ్యత ఈ శాఖదే. ప్రత్యేక వాహనాల్లో ఈ శాఖ సిబ్బంది వీధుల్లో తిరుగుతూ... షరియా చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారిపై నిఘా వేయనున్నారు. ఒక వేళ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని అక్కడికక్కడే కొరడాలతో శిక్షిస్తారు. ఇప్పటికే ఈ వాహనాలు అఫ్గాన్‌లో స్వైరవిహారం చేస్తూ.. బహిరంగంగా తిరిగే మహిళలను లక్ష్యం చేసుకుంటున్నాయి.
అమ్మాయిలు ఇళ్లకే!
తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనలకు మరింత బలం చేకూర్చే విధంగా ఇటీవలే తాలిబన్లు మరో నిర్ణయం తీసుకున్నారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే తరగతులకు హాజరుకావాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అమ్మాయిల ప్రస్తావన లేదు.
తాలిబన్లతో ఇమ్రాన్ చర్చలు
ఇస్లామాబాద్: అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చర్చలు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన శనివారం తెలిపారు. శుక్రవారం షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశంలో తాలిబన్లు సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంపై భారత్, చైనా సహా సభ్యదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లతో ఇమ్రాన్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాలిబన్ల వాహనాలపై బాంబులతో దాడి ముగ్గురి మరణం.. 20 మందికి గాయాలు
జలాలాబాద్: అఫ్గానిస్థాన్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లపై వరుస దాడులు జరుగుతున్నాయి. శనివారం నంగర్హార్ ప్రావిన్స్‌లో తాలిబన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు. ఘటనకు ఇంకా ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు. తాలిబన్ పాలకులకు వ్యతిరేకంగా ఐఎస్.. తూర్పు అఫ్గానిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శనివారం రాజధాని కాబూల్‌లోనూ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు.
తప్పు మాదే.. క్షమించండి
కాబుల్‌లో గత నెల 29న జరిగిన డ్రోన్ దాడికి సంబంధించి అమెరికా క్షమాపణ కోరింది. నాటి దాడిలో సాధారణ పౌరులే మృతి చెందారని పేర్కొంది. తమ అంతర్గత విచారణలో పొరపాటు జరిగినట్లు తేలిందని తెలిపింది. కాబుల్ విమానాశ్రయంవైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై చేసిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మృతి చెందారని ఇప్పటివరకు అమెరికా చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ దాడిలో ఏడుగురు చిన్నారుల సహా 10మంది పౌరులు మృతిచెందినట్లు ప్రకటించింది.